ప్రముఖ నటి, నిర్మాత నిహారిక కొణిదెల 2024లో విడుదలైన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుని తెలుగు చిత్రపరిశ్రమలో సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా తన మార్క్‌ను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జీ స్టూడియోస్ సమర్పణలో.. నిహారిక తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మాతగా ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి నిర్మిస్తోన్న చిత్రానికి ‘రాకాస’ అనే టైటిల్ ఖరారు చేసి.. టైటిల్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. సినిమాను ఏప్రిల్ 3న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.
‘రాకాస’ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో సంగీత్ శోభన్ ఈ చిత్రంలో కథానాయకుడిగా మెప్పించనున్నారు. సంగీత్ సోలో హీరోగా నటించనున్న తొలి సినిమా ఇదే. ఇది వరకే నిహారిక రూపొందించిన వెబ్ ప్రాజెక్ట్స్‌లో హీరో సంగీత్ శోభన్, డైరెక్టర్ మానస శర్మ భాగమయ్యారు. జీ5తో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ రూపొందించిన వెబ్ సిరీస్ ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’లో సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలో నటిస్తే.. మానస శర్మ రచయితగా వర్క్ చేశారు. తర్వాత మానస సోనీ లివ్ రూపొందించిన ‘బెంచ్ లైఫ్’కి దర్శకురాలిగా పని చేశారు. తాజాగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ5 బ్యానర్స్‌పై రూపొందుతోన్న రాకాస చిత్రంతో మానస శర్మ ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్‌గా పరిచయమవుతున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్ మాట్లాడుతూ ‘‘సంగీత్ శోభన్‌ను హీరోగా పరిచయం చేస్తూ మేం స్టార్ట్ చేసిన సినిమాకు ‘రాకాస’ అనే టైటిల్‌ను ఖరారు చేశాం. ఇదొక ఫాంటసీ కామెడీ మూవీ. నయన్ సారిక హీరోయిన్‌గా నటిస్తోంది. ఒక సాంగ్, నాలుగు రోజుల టాకీ పార్ట్ చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది.త్వరలోనే దాన్ని కంప్లీట్ చేస్తాం. సమ్మర్ సందర్బంగా ఏప్రిల్ 3న మూవీని రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. అనుదీప్ దేవ్ సంగీత సారథ్యం వహిస్తోన్న ఈ చిత్రానికి రాజు ఎదురోలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.