గత కొన్నాళ్లుగా సౌత్ సినిమాల దండయాత్రతో సమతమవుతోంది బాలీవుడ్. పుష్ప, ట్రిపుల్ ఆర్, కెజియఫ్ చాప్టర్ టు.. ఇలా బ్యాక్ టు బ్యాక్, బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేశాయి. దాంతో సౌత్ సినిమాల ధాటికి తట్టుకోలేకపోయాయి హిందీ సినిమాలు. కానీ ఇటీవల వచ్చిన ఓ సినిమా మాత్రం బాలీవుడ్‌కి పెద్ద రిలీఫ్ ఇచ్చింది. ఇంతకీ ఏంటా సినిమా..?
అల్లు అర్జున్ పుష్ప 100 కోట్లు.. రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీ స్టారర్‌గా వచ్చిన ట్రిపుల్ ఆర్ 250 కోట్లకు పైగా వసూళ్లు చేసి.. నార్త్‌లో తెలుగు సినిమాల సత్తా చాటాయి. ఇక సౌత్ నుంచి వచ్చిన మరో సినిమా కెజియఫ్ చాప్టర్2.. బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేసింది. ఏకంగా ఈ సినిమా 400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి.. హిందీ సినిమాల రికార్డ్స్ బద్దలు కొట్టింది. దాంతో ఈ సినిమాలు రిలీజ్ అయిన సమయంలో వచ్చిన బాలీవుడ్ బడా బడా సినిమాలు సైతం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. కానీ రీసెంట్‌గా వచ్చిన భూల్ భూలయ్యా 2 సినిమా మాత్రం మంచి హిట్‌గా నిలిచింది. బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ నటించిన భూల్ బులయ్యా 2 చిత్రం.. బాక్సాఫీస్ వద్ద భారీగానే సందడి చేస్తోంది. దాంతో ఈ చిత్రం హందీ ట్రేడ్ వర్గాల్లో కాస్త జోష్ నింపిందనే చెప్పాలి. దాదాపు 75 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ హార్రర్ కామెడి చిత్రం.. మే 20న ప్రేక్షకుల ముందుకొచ్చింది. మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ఈ సినిమా.. వారం రోజుల్లోనే 100 కోట్ల క్లబ్‌లో చేరిపోయినట్టు తెలుస్తోంది. దాంతో హీరో కార్తిక్ పండగ చేసుకుంటున్నాడట. అయితే ట్రిపుల్ ఆర్‌కు ముందు వచ్చిన సినిమాల్లో గంగూబాయి కథియవాడి.. ది కశ్మిర్ ఫైల్స్ మాత్రం భారీగానే వసూళ్లు చేశాయి. కానీ ట్రిపుల్ ఆర్.. కెజియఫ్ టు తర్వాత మాత్రం 100 కోట్ల సినిమాగా భూల్ భూలయ్యా 2 నిలిచిందని చెప్పొచ్చు. ఈ చిత్రాన్ని టీ సిరీస్, సీనీ 1 స్టూడియోస్ బ్యానర్‌పై.. ప్రముఖ నిర్మాతలు భూషణ్ కుమార్, మురాద్ ఖేతన్, అంజుమ్ కేతానీ, కిషన్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు.