Newly Married Couple: అందాల ముద్దుగుమ్మలు కొందరు ఈ యేడాది సహ జీవనానికి తిలోదకాలిచ్చేసి, పెళ్ళి పీటలు ఎక్కేశారు. విశేషం ఏమంటే అందులో స్టార్ హీరోయిన్ నయనతార కూడా ఉంది. ఏజ్ బార్ అయిపోతోందని కుటుంబ సభ్యులు చేసిన విన్నపాలను మన్నించి కావచ్చు పూర్ణ లాంటి వారూ నిఖా చేసుకున్నారు. యంగ్ హీరోస్ తమకు నచ్చిన అమ్మాయిల మెడలో ఎంచక్కా మూడు ముడులు వేశారు. కొందరు స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో పెళ్ళి చేసుకుంటే మరి కొందరు ఘనంగా ఈ వేడుకలను జరుపుకున్నారు.
ఈ యేడాది ప్రారంభంలోనే దర్శక, నిర్మాతలు, స్వర్గీయ బి. జయ, బి.ఎ. రాజు దంపతుల తనయుడు బి. శివశంకర్ వివాహం లావణ్యతో జరిగింది. తల్లిదండ్రుల అడుగు జాడలలో నడుస్తూ జర్నలిజంతో పాటు దర్శకుడిగానూ శివశంకర్ చిత్రసీమలో కొనసాగుతున్నాడు. ఇదే నెలలో ప్రముఖ నటి మౌనీరాయ్ వివాహం గోవాలో దుబాయ్ కు చెందిన వ్యాపార వేత్త సూరజ్ నంబియార్ తో జరిగింది. ఇండియన్ ఐడిల్ 9 విజేతగా నిలిచిన సింగర్ రేవంత్ వివాహం గుంటూరుకు చెందిన అన్వితతో ఫిబ్రవరి 6న జరిగింది. ఇదే యేడాది డిసెంబర్ లో అతను తండ్రి కావడమే కాదు… బిగ్ బాస్ సీజన్ 6 విజేతగానూ నిలవడం విశేషం. ప్రముఖ దర్శకుడు, నట నిర్మాత ఫర్హాన్ అక్తర్ వివాహం అక్తర్ శిబానీ దండేకర్ తో ఖండాలోని ఫామ్ హౌస్ లో ఫిబ్రవరి 19న నిరాడంబరంగా జరిగింది. అలానే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్టార్ హీరో రణబీర్ కపూర్, స్టార్ హీరోయిన్ అలియా భట్ వివాహం కూడా ఏప్రిల్ 14న పెద్దంత హంగూ ఆర్బాటం లేకుండా జరిగిపోయింది. అంతే కాదు… అలియా భట్ ఇదే యేడాది నవంబర్ 6న ఆడపిల్లకు జన్మనిచ్చింది. తమిళ సంగీత దర్శకుడు డి. ఇమ్మాన్ వివాహం మే 15వ తేదీని అమలీతో జరిగింది. ఇది అతనికి రెండో పెళ్ళి. 2008లో మౌనిక రిచర్డ్ ను ప్రేమ పెళ్ళి చేసుకున్న ఇమ్మాన్ ఆమెకు యేడాది క్రితం విడాకులిచ్చాడు. చిత్రం ఏమంటే… ఇప్పుడు ఇమ్మాన్ పెళ్ళాడిన అమలీకీ ఇది రెండో పెళ్ళే. ఆమెకు ఇప్పటికే ఒక పాప ఉంది. ఇక తమిళనాట తమ చిత్రాలతో మెప్పించిన ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ వివాహం చెన్నయ్ లో కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో మే 18వ తేదీ ఘనంగా జరిగింది.
సౌతిండియన్ స్టార్ హీరోయిన్ నయనతారకు, దర్శక నిర్మాత విఘ్నేష్ శివన్ కు ఇప్పటికే పెళ్ళి అయిపోయిందనే పుకారు గత ఐదారేళ్ళుగా వినిపిస్తూనే ఉంది. వారిద్దరూ ఏడేళ్ళుగా సహజీవనం చేస్తుండటమే దానికి కారణం. అయితే అందరినీ ఆశ్చర్యానికి లోను చేస్తూ జూన్ 9 వీరిద్దరూ చెన్నై సమీపంలోని షెరటాన్ హోటల్ ఓ వివాహం చేసుకున్నారు. అంతేకాదు… సరొగసీ ద్వారా అక్టోబర్ 9న మగ కవలలకు జన్మనిచ్చారు. వీరికి ఉయిర్, ఉలగం అనే పేర్లు పెట్టారు. వీరి సరోగసీ విధానం మొదట కొంత వివాదాలకు తెర తీసినా, ఆ తర్వాత తమిళనాడు ఆరోగ్యశాఖ నియమించిన కమిటీ ఇచ్చిన నివేదికతో ముగిసింది. బాలనటుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టి, ఆపైన ‘వినవయ్యా రామయ్య, ఏంజెల్’ చిత్రాలలో హీరోగా నటించిన నాగ అన్వేష్ వివాహం మారిషస్ లో జూన్ 9న కావ్య బాలితో జరిగింది. తెలుగుతో పాటు తమిళ, హిందీ చిత్రాలలోనూ వెబ్ సీరిస్ లోనూ నటించిన మధుశాలిని కూడా ఈ యేడాది పెళ్ళి పీటలు ఎక్కేసింది. తమిళ నటుడు గోకుల్ ఆనంద్ తో ఆమె వివాహం జూన్ 16న హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో జరిగింది. మలయాళీ కుట్టి షమ్నా ఖాసీం తెలుగువారికి పూర్ణగా సుపరిచితం. శ్రీహరి నటించిన ‘శ్రీమహాలక్ష్మీ’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పూర్ణ ఆ తర్వాత అనేక చిత్రాలలో కథానాయికగా నటించింది. ఆ మధ్య ఆమె పెళ్ళి చేయాలని కుటుంబ పెద్దలు నిర్ణయించినప్పుడు… అది ఊహించని వివాదాలకు దారితీసింది. పోలీసు కేసులూ అయ్యాయి. ఆ గొడవలన్నీ సద్దుమణిగిన తర్వాత పూర్ణ.. అక్టోబర్ 25న దుబాయ్ కు చెందిన జేబీఎస్ గ్రూప్ సీఈవో అసీఫ్ అలీను వివాహమాడింది. నాని ‘జెస్సీ’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన తమిళ నటుడు హరీశ్ కళ్యాణ్ చెన్నయ్ కు చెందిన పారిశ్రామిక వేత్త నర్మదా ఉదయ్ కుమార్ ను అక్టోబర్ 28న పెళ్ళి చేసుకున్నాడు.
టాలీవుడ్ లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నాగశౌర్య ప్రేమ విషయంలో గత కొన్నేళ్ళుగా రకరకాల షికార్లు పుకార్లు చేశారు. వాటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ, ఈ యంగ్ హీరో నవంబర్ 20న బెంగళూరులో అనూషా శెట్టి మెడలో మూడు ముడులు వేశాడు. అలానే ‘సాహసం శ్వాసగా సాగిపో’ మూవీతో హీరోయిన్ గా తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టిన మంజిమా మోహన్, సీనియర్ నటుడు కార్తీక్ తనయుడు, యువ కథానాయకుడు గౌతమ్ ను నవంబర్ 20న వివాహమాడింది. ప్రముఖ దర్శక నిర్మాత గుణశేఖర్ కుమార్తె, నిర్మాతగా రాణిస్తున్న నీలిమా గుణ పెళ్ళి డిసెంబర్ 2న రవి ప్రఖ్యాతో ఫలక్ నూమా ప్యాలెస్ లో ఘనంగా జరిగింది. గ్లామర్ హీరోయిన్ గానే కాకుండా చిన్నారులను అడాప్ట్ చేసుకుని వారి విద్యాబాధ్యతలను భుజానకెత్తుకున్న హన్సిక మోత్వాని సైతం ఈ యేడాది వివాహబంధంలోకి అడుగుపెట్టింది. తన బోయ్ ఫ్రెండ్, ఎంటర్ పెన్యూర్ సోహెల్ ను ఆమె జైపూర్ లోని ఫోర్ట్ లో డిసెంబర్ 4న పెళ్ళాడింది. పాపులర్ టీవీ యాంకర్, మోడల్, బిగ్ బాస్ సీజన్ 6 పార్టిసిపెంట్ నేహా చౌదరి వివాహం డిసెంబర్ 18న ఆమె స్నేహితుడు అనిల్ తో జరిగింది. సరిగ్గా అదే రోజు బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలే పూర్తి కావడంతో పార్టిసిపెంట్స్ అంతా ఆమె పెళ్ళికి వెళ్ళి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందింది వీరే!
పాపులర్ యాక్టర్, సింగర్ నిక్ జోసన్ ను ప్రియాంక చోప్రా 2018లో వివాహం చేసుకుంది. ఈ యేడాది జనవరి 22న సరొగసీ ద్వారా తమకు బిడ్డ పుట్టిందని వారు తెలిపారు. అలానే 2020లో కరోనా సమయంలో పెళ్ళి పీటలు ఎక్కిన కాజల్, గౌతమ్ కిచ్లాకూ ఏప్రిల్ 19న కొడుకు పుట్టాడు. ఈ యేడాది మే 18న నిక్కీ గల్రాని వివాహం జరగ్గా, ఆ మర్నాడే ఆమె సోదరి, నటి సంజనా గల్రానీ మగబిడ్డకు జన్మనిచ్చింది. మరో కన్నడ నటి ప్రణీత సుభాష్ వివాహం గత యేడాది ఏప్రిల్ లో వ్యాపారవేత్త నితిన్ రాజ్ తో జరిగింది. వారికి ఈ యేడాది జూన్ 10న మగబిడ్డ జన్మించాడు. నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్, గాయని చిన్మయి శ్రీపాద జూన్ 21న కవలలకు జన్మనిచ్చారు. వారికి ద్రిప్తా, శర్వాస్ అనే పేర్లు పెట్టారు. ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు వివాహం రెండేళ్ళ క్రితం తేజస్వినితో జరిగింది. ఈ యేడాది జూన్ 29న తేజస్విని మగబిడ్డకు జన్మనిచ్చింది. 2018లో వివాహం చేసుకున్న సోనమ్ కపూర్, ఆనంద్ అహుజా దంపతులకు ఆగస్ట్ 20న మగబిడ్డ జన్మించాడు. ఇదిలా ఉంటే… మెగాభిమానుల చిరకాల కోరికకు ఫుల్ స్టాప్ పెడుతూ, రామ్ చరణ్, ఉపాసన దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారంటూ చిరంజీవి డిసెంబర్ 12న ప్రకటించారు. అలానే ఎనిమిదేళ్ళ క్రితం వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన ప్రముఖ దర్శకుడు అట్లీ, నటి కృష్ణప్రియ కూడా త్వరలో తాము పేరెంట్స్ అవ్వబోతున్నామంటూ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఆ రకంగా ఈ యేడాది కొందరు సెలబ్రిటీస్ నవమాసాలు మోసి పిల్లలకు జన్మనిస్తే, మరికొందరు సరోగసి ద్వారా వారసులను పొందారు.