మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా తన అభిమానులకు పెద్ద సర్ ప్రైజ్ ఇచ్చారు. హాలీవుడ్ ఫేమస్ వెబ్ సిరీస్ ‘స్ట్రేంజర్ థింగ్స్’ థీమ్ సాంగ్ కు ఆయన తెలుగు, తమిళ్ లో మ్యూజిక్ ను అందిస్తున్నట్లు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ‘స్ట్రేంజర్ థింగ్స్’ గురించి వెబ్ సిరీస్ లు చూసేవారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతోమందిని యూత్ ను ఈ సిరీస్ ఆకట్టుకొంటుంది. సైన్స్ ఫిక్షన్, హార్రర్ జోనర్‌లో వచ్చిన ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం విదితమే. ఇప్పటికే మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ సిరీస్ నాలుగో సీజన్ లోకి ఎంటర్ అవుతుంది. అయితే ఈసారి ఈ సిరీస్ తెలుగు, తమిళ్‌లో అందుబాటులోకి రానుంది. ఇక ఈ వెర్షన్ కు మ్యూజిక్ మాస్ట్రో థీమ్ మ్యూజిక్ ను అందించారు.
అసలు ‘స్ట్రేంజర్ థింగ్స్’ లో ఉన్న హైలైటే థీమ్ మ్యూజిక్. 1980 లో కథ నడుస్తుంటే ఈ మ్యూజిక్ అందరిని ఆలోకానికి తీసుకెళ్ళిపోతుంది. ఈ థీమ్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ థీమ్ మ్యూజిక్ ను ఇళయరాజా తనదైన శైలిలో వినిపించి మెస్మరైజ్ చేశారు. ఇక ఈ వీడియోను నెట్ ఫ్లిక్స్ షేర్ చేస్తూ “మ్యాస్ట్రో ఇళయరాజా వెర్షన్ ‘ద స్ట్రేంజర్ థింగ్స్’ థీమ్ మ్యూజిక్‌ను మీ ముందుకు తీసుకువస్తున్నాం. తెలుగు, తమిళ్‌లో ఈ షో త్వరలోనే ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది” అని చెప్పుకొచ్చారు. దీంతో అభిమానులు ఈ సిరీస్ తెలుగు, తమిళ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఈ సిరీస్ కథ విషయానికొస్తే “హాకిన్స్ అనే పట్టణంలో ఓ బాలుడు కనిపించకుండా పోతాడు. అదే సమయంలో ఓ బాలిక ఆ పట్టణానికీ వస్తుంది. ఆ బాలుడిని కనిపెట్టడం కోసం అతడి తల్లి, స్నేహితులు చేసిన ప్రయత్నాలే ఈ కథ. అతీంద్రియ శక్తులు, రాక్షస జీవులతో వారు చేసే పోరాటాలు అద్భుతంగా ఉంటాయి. మరి ఈ సిరీస్ ఎప్పుడు తెలుగులో స్ట్రీమింగ్ అవుతుందో చూడాలి.