మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. మార్చి 25 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా కలెక్షన్ల సునామీ సృష్టించింది. దాదాపు రూ. 1200 కోట్లు వసూలు చేసింది. ఇక థియేటర్లోనే కాకుండా ఓటిటీలో కూడా తన సత్తా చాటుతోంది. ఇక ఈ సినిమా ఖ్యాతి దేశాన్ని దాటిపోయిందన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విదేశీయులు ఈ సినిమాకు మంత్ర ముగ్దులై రాజమౌళి కళాత్మకతను ఆకాశానికెత్తేస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా నెట్ ఫ్లిక్స్ సీఈఓ సైతం ఆ లిస్ట్ లో చేరిపోయాడు.
నెట్‌ప్లిక్స్ సీఈవో టెడ్ సరండోస్ ఈ చిత్రాన్ని వీక్షించి.. అందరిని ఈ సినిమా చూడమని రికమండ్ చేయడం విశేషం. ” ఒకవేళ నెట్ ఫ్లిక్స్ లో ఆర్ఆర్ఆర్ ను చూడనివారు వెంటనే చూడండి. ఈ ఏడాదిలో మీరు చూడబోయే అద్భుతమైన సినిమాల్లో ఇది ఒకటి. ఆర్ఆర్ఆర్ హిందీ వెర్షన్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఉంది.. ఇట్స్ ఏ బ్లాస్ట్” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. నెట్‌ప్లిక్స్ సీఈవో ఒక తెలుగు సినిమా గురించి పొగడడం ఇదే మొదటిసారి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక ఈ పోస్ట్ ను ఆర్ఆర్ఆర్ మూవీ షేర్ చేస్తూ నెట్‌ప్లిక్స్ సీఈవో టెడ్ సరండోస్ థాంక్స్ చెప్పింది.