Satyabhama: కాజల్ అగర్వాల్ పెళ్లి తరువాత కొంత గ్యాప్ ఇచ్చిన విషయం తెల్సిందే. ఆ తరువాత వెంటనే ఆమె తల్లిగా మారి మరికొంత సమయం గ్యాప్ తీసుకుంది. ఇక ఈ ఏడాది నుంచి కాజల్ రీఎంట్రీ షురూ చేసింది. భగవంత్ కేసరి సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. అయితే ఇది ఆమెకు ప్లస్ అవ్వలేదని చెప్పాలి. క్రెడిట్ అంతా శ్రీలీల కొట్టేయడంతో కాజల్ కు ఆశించిన గుర్తింపు దక్కలేదు. ఇక ఈ సినిమా తరువాత కాజల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం సత్యభామ. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తుండగా.. మేజర్ చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించాడు. క్రైమ్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తాజాగా ఈ చిత్రంలోకి టాలెంటెడ్ నటుడు నవీన్ చంద్ర అడుగుపెట్టాడు. ఈ సినిమాలో నవీన్ చంద్ర అమరేందర్ అనే క్యారెక్టర్ లో నటిస్తున్నట్లు తెలుపుతూ ఆయన ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. చాలా సాదాసీదాగా ఒక పిల్లిని ఎత్తుకొని దాంతో ఆడుకుంటూ కనిపించాడు. ఈ సినిమాలో నవీన్ చంద్ర పర్ ఫార్మెన్స్ టెర్రఫిక్ గా ఉంటుందని మేకర్స్ వెల్లడించారు. ఇప్పటికే నవీన్ చంద్ర ఎన్నో విలన్ పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈ సినిమాలో నవీన్ చంద్ర అడుగుపెట్టడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. మరి ఈ సినిమాలో ఈ అమరేందర్.. సత్యభామకు కృష్ణుడా.. ? లేక.. ఆమె వెతుకుతున్న నరకాసురుడా.. ? అనేది తెలియాలి అంటే సినిమా రిలీజ్ అయ్యేవరకు ఆగాల్సిందే.