నాట్యంఅంటే ఓ కథను డాన్స్ ద్వారా అందమైన రూపంలో చెప్పడమే. అలాంటి ఓ అద్భుతమైన కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం నాట్యం. ఈ మూవీ ద్వారా ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి సంధ్యారాజు నటిగా, నిర్మాతగా, కొరియోగ్రాఫర్‌గా, ప్రొడక్షన్ డిజైనర్‌గా, కాస్ట్యూమ్ డిజైనర్‌గా వెండితెరకు పరిచయమవుతున్నారు. ఈ చిత్రం కోసం రేవంత్ కోరుకొండ తొలిసారి మెగా ఫోన్ పట్టుకున్నారు. ”ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్‌కు మంచి స్పందన వచ్చిందని, అలానే నందమూరి బాలకృష్ణ ఆవిష్కరించిన తొలిగీతం నమః శివాయకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించిందని సంధ్యారాజు తెలిపారు.
తాజాగా ఈ సినిమాను అక్టోబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారామె. విశేషం ఏమంటే… ఈ విషయాన్ని కేవలం మాటలతో చెప్పకుండా… మూవీ విడుదల కాబోతున్న హైదరాబాద్ క్రాస్ రోడ్స్ లోని మెయిన్ థియేటర్ సుదర్శన్ 35 ఎం.ఎం. ఆవరణలో తన శిష్యులతో కలిసి నృత్యరూపకం ద్వారా తెలిపారు సంధ్యారాజు. కమల్ కామరాజ్, రోహిత్ బెహల్, ఆదిత్య మీనన్, భానుప్రియ, సుభలేఖ సుధాకర్, రుక్మిణీ విజయకుమార్, బేబీ దీవెన ఇందులో ఇతర ప్రధాన పాత్రలను పోషించారు. శ్రావణ్ భరద్వాజ్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి కరుణాకర్ అడిగర్ల సాహిత్యం అందించారు. నిశ్రింకళ ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
