నేచురల్ స్టార్ నాని ‘అంటే సుందరానికి’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. శుక్రవారం రాబోతున్న ఈ సినిమాతో అయినా నాని హిట్ కొడతాడనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు. నిజానికి నాని కూడా అదే కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ లో నజ్రియా నజీమ్ హీరోయిన్. అనుపమ పరమేశ్వరన్ కూడా నటించిన ఈ సినిమాను మైత్రీ మూవీస్ నిర్మించింది. సెన్సార్ లో బిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నా సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉండి అందరినీ ఆకట్టుకుంటుందని యూనిట్ భావిస్తోంది.
నాని ఖాతాలో ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ తర్వాత సరైన హిట్ లేదు. మధ్యలో ‘దేవదాసు, జెర్సీ’ పర్వాలేదనిపించాయి. ఇక ‘కృష్ణార్జున యుద్ధం, గ్యాంగ్ లీడర్, వి, టక్ జగదీశ్, శ్యామ్ సింగ్ రాయ్’ వంటి సినిమాలన్నీ పూర్తిగా నిరాశపరిశాయి. నాని గత చిత్రం ‘శ్యామ్ సింగ్ రాయ్’ పై భారీ ఆశలు పెట్టుకున్నా అదీ తుస్సుమనిపించింది. సో ఇప్పుడు ‘అంటే సుందరానికి’ నిరాశపరిస్తే మాత్రం మళ్ళీ ‘దసరా’ వరకూ వేచిచూడాల్సి ఉంటుంది. ఆ సినిమా నిర్మాతలు ఆర్ధికపరమైన ఇబ్బందుల్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పారితోషికం పెండింగ్ లో పడినందు వల్లే ‘దసరా’ నిర్మాత చెరుకూరి సుధాకర్ తీస్తున్న రవితేజ సినిమా ‘రామారావు అన్ డ్యూటీ’ సినిమాను డబ్బింగ్ చెప్పకుండా పక్కన పెట్టాడని సమాచారం. ఈ నేపథ్యంలో నాని ‘అంటే సుందరానికి’తోనే హిట్ కొట్టాల్సి ఉంది. మరి సుందరంతో అయినా నాని సక్సెస్ ట్రాక్ లోకి రావాలని కోరుకుందాం.