పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ‘హరిహర వీరమ్లలు’ను వచ్చే యేడాది మార్చి 30న విడుదల చేయబోతున్నట్టు ఆ చిత్ర సమర్పకుడు ఎ.ఎం. రత్నం ఇటీవల తెలిపారు. చిత్రం ఏమంటే… సరిగ్గా అదే రోజున నానితో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ‘దసరా’ మూవీ కూడా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘దసరా’ మూవీని నిర్మాత సుధాకర్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నారు. మరి ఒకే రోజున తెలుగు నుండి రెండు పాన్ ఇండియా సినిమాలు విడుదల కావడం అంటే అది విశేషమే.
ఇక ‘దసరా’ మూవీ విషయానికి వస్తే… సినిమా రిలీజ్ డేట్ ను ఖరారు చేస్తూ చిత్ర బృందం శుక్రవారం ఓ పోస్టర్ ను విడుదల చేసింది. అందులో అలనాటి శృంగార తార సిల్క్ స్మిత పోస్టర్ ముందు నాని లుంగీ కట్టుకుని రగ్గడ్ లుక్ తో కనిపిస్తున్నారు. ఈ మూవీకి నాని అద్భుతమైన మేకోవర్ చేశారనేది ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ చూస్తే అర్థమౌతోంది. జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్ నాయికగా నటిస్తున్న ‘దసరా’లో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నాని ఫుల్ లెంగ్త్ మాస్, యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపిస్తున్న ఈ చిత్రం గోదావరిఖనిలోని సింగరేణి కోల్ మైన్స్ దగ్గర ఉన్న ఒక గ్రామం నేపధ్యంలో జరుగుతుంది. దీనికి ఎడిటర్‌గా నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా విజయ్ చాగంటి వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ కోసం గత నెలలో హైదరాబాద్ లో ఓ భారీ సెట్ వేసి షూటింగ్ చేశారు. దానికి ముందు షెడ్యూల్ లో స్టంట్ డైరెక్టర్ అన్బరీవ్ ఆధ్వర్యంలో భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను తీశారు. అలానే నాని, కీర్తి సురేష్‌లపై ఓ భారీ పాట తెరకెక్కించారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’లోని ‘నాటు నాటు’ పాట కొరియోగ్రఫీ అందించి యావత్ దేశాన్ని ఉర్రూతలూగించిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీలో 500 మంది డ్యాన్సర్లతో పాటని అద్భుతంగా చిత్రీకరించారు. ఇలా ఓ విభిన్నమైన చిత్రంగా ‘దసరా’ మార్చి 30న జనం ముందుకు రాబోతోంది.