Nandini Reddy: మొన్నటి దాకా ‘ఆకాశంలో సగం మేమే’ అంటూ సాగారు కొందరు మహిళలు. మరికొందరు ‘ఆకాశమే మేము’ అంటున్నారు.దర్శకురాలు నందినీ రెడ్డి సైతం ఆ నింగినే హద్దుగా చేసుకొని పయనించే ప్రయత్నంలో చిత్రసీమలో అడుగు పెట్టారు. నవతరం దర్శకురాలిగా మంచి గుర్తింపు సంపాదించారు. ప్రస్తుతం ‘అన్నీ మంచి శకునములే’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించే ప్రయత్నంలో ఉన్నారామె.
నందినీ రెడ్డి 1980 మార్చి 4న హైదరాబాద్ లో జన్మించారు. ఆమె తండ్రి చిత్తూరు జిల్లాకు చెందిన భరత్ వి. రెడ్డి, తల్లి రూపారెడ్డి వరంగల్ కు చెందినవారు. చిన్నప్పటి నుంచీ చురుకైన నందినికి ఆమె కన్నవారు స్వేచ్ఛనిచ్చారు. సికిందరాబాద్ సెయింట్ యాన్స్ స్కూల్ లో చదివిన నందిని, కోఠి ఉమెన్స్ కాలేజ్ లో డిగ్రీ చదివారు. న్యూ ఢిల్లీలోని జవహర్ లాల్ యూనివర్సిటీలో ఎమ్.ఏ. పొలిటికల్ సైన్స్ చదివారు. మొదటి నుంచీ సినిమాలపట్ల ఆసక్తి పెంచుకున్న నందిని 16 ఏళ్ళ వయసులోనే నిర్మాత, దర్శకుడు గుణ్ణం గంగరాజును కలిశారు. ఆయన తెరకెక్కించిన ‘లిటిల్ సోల్జర్స్’కు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. సినిమాటోగ్రాఫర్-డైరెక్టర్ రసూల్ ఆమెలోని ఉత్సాహం చూసి, కృష్ణవంశీకి పరిచయం చేయగా, మొదట్లో ఆయన తన వద్ద ఖాళీ లేదన్నారు. తరువాత రమ్యకృష్ణ కూడా నందినిలోని చలాకీతనం చూసి ముచ్చటపడి, కృష్ణవంశీకి సిఫార్స్ చేశారు. అలా వంశీ దగ్గర కొంతకాలం అసిస్టెంట్ గా పనిచేశారామె. సురేశ్ ప్రొడక్షన్స్ లోనూ కొన్ని సినిమాలకు అసోసియేట్ గా ఉన్నారామె. ‘అలా మొదలైంది’ కథ రూపొందించుకొని, మెగాఫోన్ కు ప్రయత్నాలు చేశారు. ఆ సమయంలో నిర్మాత కె.ఎల్. దామోదర ప్రసాద్ ఆమెకు తొలిసారి మెగాఫోన్ పట్టే అవకాశం కల్పించారు. నాని, నిత్యమీనన్ నటించిన ‘అలా మొదలైంది’ జనాన్ని భలేగా ఆకట్టుకుంది. తొలి చిత్రంతోనే దర్శకురాలిగా నందినీ రెడ్డికి మంచి పేరు లభించింది.
అవకాశాలు తలుపు తట్టినా, ఆచి తూచి అడుగేయాలనే నందిని నిర్ణయించారు. రెండేళ్ళ తరువాత సమంత, సిద్ధార్థ్ తో ‘జబర్దస్త్’ అనే చిత్రం తెరకెక్కించారు. మరో మూడేళ్ళకు ‘కళ్యాణ వైభోగమే’, తరువాత సమంత ప్రధాన పాత్రలో ‘ఓ బేబీ’ చిత్రాలు రూపొందించారు నందిని. ఆమె మరికొందరు దర్శకులతో కలసి రూపొందించిన వెబ్ సిరీస్ ‘పిట్టకథలు’ సైతం ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ‘అన్నీ మంచి శకునములే’ చిత్రాన్ని తెరకెక్కించారు. సంతోష్ శోభన్, మాళవికా నాయర్ జంటగా నటిస్తున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా తరువాతయినా నందినీ రెడ్డికీ ‘అన్నీ మంచి శకునములే’ ఎదురై, మరిన్ని సినిమాలతో జనాన్ని మురిపించాలని ఆశిద్దాం.