ఈ యేడాది ఫిబ్రవరిలో విడుదలైన ‘అల్లరి’ నరేశ్ ‘నాంది’ సినిమా ప్రేక్షకుల అభిమానాన్నే కాదు, విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. న్యాయవ్యవస్థలోని లోపాలనే కాకుండా, ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 211 ద్వారా ఎలాంటి న్యాయం పొందవచ్చో కూడా చెప్పిన చిత్రం ‘నాంది’. ఇదే అందరినీ ఆకట్టుకుంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో సతీశ్ వేగేశ్న ఈ సినిమాను నిర్మించారు. మూవీ విడుదలైనప్పుడే ఆ యూనిట్ ను ప్రశంసించిన ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకున్నారు. తాజాగా ఆయన హిందీ చిత్రాన్ని అజయ్ దేవ్ గన్ తో కలిసి మొదలు పెట్టబోతున్నారు.
ప్రముఖ కథానాయకుడు, నిర్మాత దర్శకుడు అజయ్ దేవ్ గన్ సైతం సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని నిర్థారించారు. దిల్ రాజుతో కలిసి హిందీలో ‘నాంది’ని రీమేక్ చేస్తున్నట్టు గెలిపారు. అయితే… ఇందులో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు. అతి త్వరలోనే దానికి సంబంధించిన విశేషాలు చెప్పబోతున్నారు. విశేషం ఏమంటే… ‘దిల్’ రాజు ఇప్పటికే బాలీవుడ్ లో బలమైన పునాదిని ఏర్పాటు చేసుకుంటున్నారు. లైక్ మైండెడ్ ప్రొడ్యూసర్స్ తో కలిసి వరుసగా తెలుగు సినిమాలను రీమేక్ చేస్తున్నారు. ‘జెర్సీ’ ని హిందీలో రీమేక్ చేస్తున్న ‘దిల్’ రాజు… ‘హిట్’, ‘ఎఫ్ 2’ చిత్రాలను సైతం బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నారు.