(ఏప్రిల్ 30న ‘నమక్ హలాల్’కు 40 ఏళ్ళు)
అమితాబ్ బచ్చన్ ‘యాంగ్రీ యంగ్ మేన్’ ఇమేజ్ తో ఒకప్పుడు వరుస విజయాలు చూశారు. అయితే అదే మూసలో సాగిపోకుండా వైవిధ్యం కోసం నవరసాలూ ఒలికిస్తూ నటించి జనం చేత జేజేలు అందుకున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఆయన అనేక చిత్రాలలో హాస్యరసాన్నీ భలేగా పండించారు. అలా అమితాబ్ నవ్వులు పూయించిన చిత్రాలలో ‘నమక్ హలాల్’ సైతం స్థానం సంపాదించింది. చిత్రమేమంటే అమితాబ్ ను ‘యాంగ్రీ యంగ్ మేన్’గా తన ‘జంజీర్’ చిత్రంతో జనం ముందు నిలిపిన దర్శకుడు ప్రకాశ్ మెహ్రా దర్శకత్వంలోనే ఈ ‘నమక్ హలాల్’ కూడా రూపొందింది. 1982 ఏప్రిల్ 30న ‘నమక్ హలాల్’ విడుదలై విజయఢంకా మోగించింది.
‘నమక్ హలాల్’ కథ విషయానికి వస్తే- రాజాసింగ్ అనే జమీందార్ కు భీమ్ సింగ్ నమ్మినబంటు. వారి ఎస్టేట్ వ్యవహారాలు చూస్తూ ఉంటాడు. రాజా సింగ్ దాయాది గిరిధర్ సింగ్ ఆయనను అంతమొందించాలని పలుమార్లు ప్రయత్నిస్తాడు. ప్రతీసారి భీమ్ సింగ్ ఆయనను రక్షించి ఉంటాడు. దాంతో తన ఆస్తికి భీమ్ సింగ్ భార్య సావిత్రిని ట్రస్టీగా నియమిస్తాడు రాజాసింగ్. అలాగే పసివాడైన తన కొడుకు రాజ్ కుమార్ బాధ్యతనూ ఆమెకు అప్పగిస్తాడు. అది తెలిసిన గిరిధర్ సింగ్ ఆవేశంతో భీమ్ సింగ్, రాజా సింగ్ ను చంపేస్తాడు. భీమ్ సింగ్ కు సావిత్రి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్ కుమార్ ను కాపాడతానని మాట ఇస్తుంది. ఇది తెలియని భీమ్ సింగ్ తండ్రి దశరథ్ సింగ్ కోడలు సావిత్రిని అనుమానిస్తాడు. ధనం కోసం భర్తను, రాజాను ఆమెనే చంపేసిందని నమ్ముతాడు. అందువల్ల తన మనవడు అర్జున్ ను దూరంగా తీసుకు వెళతాడు. భర్తకిచ్చిన మాట కోసం రాజ్ కుమార్ తోనే సావిత్రి ఉంటుంది. పెద్దయ్యాక సావిత్రి అసలు కొడుకు అర్జున్ ఉద్యోగంకోసం పట్నం వస్తాడు. అక్కడ రాజ్ కుమార్ ఫైవ్ స్టార్ హోటల్ లో బెల్ బాయ్ గా చేరతాడు. అక్కడే పనిచేసే పూనమ్ ను ప్రేమిస్తాడు. గిరిధర్ సింగ్ తనయుడు రంజిత్ సింగ్ అదే హోటల్ లో మేనేజర్ గా పనిచేస్తూ, ఎప్పటి కప్పుడు రాజ్ కుమార్ ను చంపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నిషా అనే డాన్సర్ ను రాజ్ ను ప్రేమించినట్టు నటించి, చంపేయమని నియమిస్తాడు రంజిత్. కానీ, రాజ్, నిషా నిజంగానే ప్రేమించుకుంటారు. అర్జున్ కు సావిత్రి తన అసలు తల్లి అని తెలుస్తుంది. ఎలాగైనా రాజ్ కుమార్ ను కాపాడతానని తల్లికి మాట ఇస్తాడు. ఈ లోగా అసలు విషయం తెలుసుకున్న రంజిత్ అతని తండ్రి అర్జున్, రాజా కుటుంబాల్లోని సభ్యులను కిడ్నాప్ చేస్తారు. ఆస్తి మొత్తం రంజిత్ పేర రాయమని బలవంత పెడతారు. అర్జున్ అందరికీ దేహశుద్ధిచేసి, రాజ్ ను అతని ఆస్తిని కాపాడతాడు. అర్జున్ -పూనమ్ ను, రాజా- నిషాను పెళ్ళాడడంతో కథ సుఖాంతమవుతుంది.
ఈ చిత్రంలో అర్జున్ గా అమితాబ్ బచ్చన్, రాజాగా శశికపూర్, పూనమ్ గా స్మితా పాటిల్, నిషాగా పర్వీన్ బాబీ, సావిత్రిగా వహిదా రెహమాన్ నటించారు. మిగిలిన పాత్రల్లో ఓం ప్రకాశ్, రంజిత్, సత్యేన్ కప్పు, విజు ఖోటే, రామ్ సేథీ, కమల్ కపూర్, సురేశ్ ఓబెరాయ్, ఆశాలత నటించారు. ఈ చిత్రానికి నటుడు ఖాదర్ ఖాన్ డైలాగ్స్ రాశారు. బప్పిలహిరి సంగీతానికి అంజాన్ పాటలు రాశారు. ఇందులోని “పగ్ ఘుంగ్రూ బంద్…”, “తోడీ సీ జో పీ లి హై…”, “ఆజ్ రపట్…జాయే తో…”, “రాత్ బాకీ… రాత్ బాకీ…”, “జవానీ జానే మన్…” పాటలు విశేషంగా అలరించాయి.
‘నమక్ హలాల్’లో అమితాబ్ తో పాటు శశి కపూర్ సైతం మరో కీలక పాత్ర పోషించారు. అంటే ఆయనది సెకండ్ హీరో రోల్ అన్న మాట! ఒకప్పుడు రాజేశ్ ఖన్నా సూపర్ స్టార్ గా సాగుతున్న రోజుల్లో ఆయన హీరోగా, అమితాబ్ సైడ్ హీరోగా ‘నమక్ హరామ్’ అనే సినిమా తెరకెక్కింది. ఆ చిత్రం సైతం మంచి విజయం సాధించింది. అందులో అమితాబ్ పాత్ర సీరియస్ గా కనిపిస్తుంది. అందుకు పూర్తి భిన్నమైన పాత్రలో ‘నమక్ హలాల్’లో అమితాబ్ కనిపించడం అప్పట్లో విశేషంగా చర్చించుకున్నారు. ఇక ఆఫ్ బీట్ మూవీస్ లోనూ, ఆర్ట్ ఫిలిమ్స్ లోనూ నటిస్తూ సాగిన స్మితా పాటిల్ ఇందులో గ్లామర్ నూ భలేగా పండించారు. అంతకు ముందు ప్రకాశ్ మెహ్రా తెరకెక్కించిన అనేక చిత్రాలకు కళ్యాణ్ జీ – ఆనంద్ జీ సంగీతం సమకూర్చారు. ఈ సినిమాతో తొలిసారి ప్రకాశ్ మెహ్రాతో బప్పిలహిరి పనిచేశారు.
‘నమక్ హలాల్’ ఘనవిజయం సాధించింది. 1982లో టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలచింది. పలు కేంద్రాలలో రజతోత్సవం జరుపుకుంది. ఈ చిత్రాన్ని తెలుగులో మోహన్ బాబు హీరోగా ‘భలే రాముడు’ పేరుతో రీమేక్ చేశారు. రజనీకాంత్ హీరోగా తమిళంలో ‘వేలైక్కారన్’గానూ పునర్నిర్మించారు. ‘భలే రాముడు’ కంటే ‘వేలైక్కారన్’ భలేగా అలరించింది.