అక్కినేని నాగార్జున ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తో ఈరోజు మధ్యాహ్నం భేటీ కానున్నారు. క్యాబినెట్ సమావేశం అనంతరం ఈ భేటీ జరగనుంది. ఇక ఇప్పటికే ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసింది. ఈ నేపథ్యంలో నాగార్జున తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఏపీ ముఖ్యమంత్రిని కలుస్తుండడం ఆసక్తికరంగా మారింది. ఈ మీటింగ్ కు నాగార్జునతో పాటు మరో నలుగురు ప్రత్యేక విమానంలో బయల్దేరి ఇప్పటికే విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. సినీ నిర్మాత ప్రీతమ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి కూడా ఈ బృందంలో ఉన్నారు. సినిమా టికెట్ల ఆన్‌లైన్ అంశానికి సంబంధించి కొంతకాలంగా కసరత్తు జరుగుతోంది. దీనికి సంబంధించి చట్ట సవరణ తీసుకురావాలనే అంశంపై చర్చించిన క్యాబినెట్.. సినిమా చట్ట సవరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.
Read Also : పుష్ప : దుమ్మురేపుతున్న “నా సామీ రారా సామీ” సాంగ్
మరికాసేపట్లోనే మర్యాదపూర్వకంగా నాగార్జునతో పాటు సినీ నిర్మాతలు, ఒక దర్శకుడు సీఎం జగన్ ను కలవనున్నారు. ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో జరిగిన కొన్ని కీలక పరిణామాలు, అలాగే పవన్ కళ్యాణ్ చేసిన సంచలన వ్యాఖ్యలు, తెలుగు ప్రభుత్వాలకు చిరంజీవి స్పెషల్ రిక్వెస్ట్, ఆన్‌లైన్ టికెటింగ్ చర్చల నేపథ్యంలో నాగార్జున ముఖ్యమంత్రిని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి నాగార్జున ఈ భేటీలో ఏఏ అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్తారు అనే విషయం తెలియాల్సి ఉంది.