NTV Telugu Site icon

Nag Ashwin Birthday Special: రెండే… కానీ ప్రతిభలో మేటి!

Nag Ashwin

Nag Ashwin

అభిరుచి ఉండాలే కానీ, అనుభవంతో పనేంటి!? పట్టుమని తీసింది రెండంటే రెండే సినిమాలు. జనం నాడి ఇట్టే పట్టేశాడు. జనం కోరేదే మనం అందించాలని నిర్ణయించాడు. ‘మహానటి’ని తెరకెక్కించాడు. అంతే… ఆ ఒక్క సినిమాతోనే జనం మదిని భలేగా దోచేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్.
ఇప్పుడు నాగ్ అశ్విన్ అంటే అంతగా తెలియని వారు సైతం, ‘మహానటి’ డైరెక్టర్ అనగానే అతని పేరు చెప్పేస్తున్నారు. అంతలా పాపులర్ అయిన నాగ్ అశ్విన్ త్వరలోనే ప్రభాస్, దీపికా పదుకొణేతో ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ లోగా ఖాళీగా ఉండకుండా గత సంవత్సరం ‘జాతిరత్నాలు’కు నిర్మాతగా మారిపోయాడు. అనుదీప్ ను ఈ సినిమా ద్వారా దర్శకునిగా నిలిపాడు. ‘జాతి రత్నాలు’ తెరకెక్కడంలో నాగ్ అశ్విన్ కేవలం నిర్మాత పాత్రకే పరిమితమయ్యాడు. ఏమైతేనేం, గడచిన యేడాది ఆ సినిమా జనానికి భలేగా కితకితలు పెట్టింది. ఎంతలా అలరించిందంటే- “క్రికెట్ లో గోల్ కీపర్ ఉంటాడన్న” సత్యాన్ని చాటింది!

నాగ్ అశ్విన్ 1986 ఏప్రిల్ 23న హైదరాబాద్ లో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు జయంతి రెడ్డి, జయరామ్ ఇద్దరూ డాక్టర్లు. వారి ‘జేజే హాస్పిటల్’ హైదరాబాద్ లో సుప్రసిద్ధమైంది . నాగ్ అశ్విన్ కు చిన్నతనం నుంచీ ఫైన్ ఆర్ట్స్ మీద ఆసక్తి ఉండేది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదువుకున్నాడు. మణిపాల్ ఎమ్.ఐ.సి. నుండి ‘మాస్ కమ్యూనికేషన్’లో బ్యాచ్ లర్ డిగ్రీ సంపాదించాడు. ‘న్యూ యార్క్ ఫిలిమ్ అకాడమీ’లో ఫిలిమ్ డైరెక్షన్ కోర్సు చేశాడు. అజయ్ శాస్త్రి డైరెక్షన్ లో మంచు లక్ష్మి నిర్మించిన ‘నేను మీకు తెలుసా?’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన అశ్విన్, శేఖర్ కమ్ముల వద్ద ‘లీడర్’, ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలకు అసోసియేట్ గా ఉన్నాడు. ప్రముఖ నిర్మాత, వైజయంతీ మూవీస్ అధినేత సి.అశ్వనీదత్ కూతురు ప్రియాంక దత్ కు తొలి నుంచీ నాగ్ అశ్విన్ అంటే అభిమానం, అలాగే అతని తపనను ఆమె ఎంతో గౌరవించేది. వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ముందుగా తనను తాను దర్శకునిగా ప్రూవ్ చేసుకోవాలని తపించాడు అశ్విన్. దాంతో ప్రియాంక, ఆమె సోదరి స్వప్న కలసి నాగ్ అశ్విన్ ను దర్శకునిగా పరిచయంచేస్తూ ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ నిర్మించారు. ఈ సినిమా నాగ్అశ్విన్ కు దర్శకునిగా మంచి పేరు సంపాదించి పెట్టింది. ఆ తరువాత నాగ్ అశ్విన్, ప్రియాంక దత్ పెళ్ళాడారు. నాగ్ అశ్విన్ లోని ప్రతిభ జనానికి పరిచయం కాగానే, ‘మహానటి’ చిత్రాన్ని కూడా స్వప్న, ప్రియాంక నిర్మించారు. ఈ సినిమా విడుదలయ్యాక ఆ చిత్రం సాధించిన విజయం, వచ్చిన పేరు ప్రతిష్ఠలు అందరికీ తెలిసినవే. ‘మహానటి’ ద్వారా కీర్తి సురేశ్ జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా నిలిచింది. ఇక ఉత్తమ ప్రాంతీయ చిత్రంగానూ ‘మహానటి’ నిలచింది. బెస్ట్ క్యాస్టూమ్ డిజైన్ విభాగంలోనూ ‘మహానటి’ నేషనల్ అవార్డు సంపాదించింది.

‘మహానటి’విజయంతో నాగ్ అశ్విన్ పేరు మారుమోగి పోయింది. ‘బాహుబలి’ తరువాత ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ ఓ సైంటిఫిక్‌ ఫిక్షన్ తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ ప్రకటన చేసి కూడా యేడాది దాటింది. మరి ప్రభాస్ తో నాగ్ అశ్విన్ మూవీ ఎప్పుడు ఎలా పట్టాలెక్కుతుందో? ఏ తీరున జనాన్ని మురిపిస్తుందో చూడాలి.