ఇటీవలే యూకేలో జరగనున్న ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ కి ఎంపికైన చిన్న చిత్రం ‘ముత్తయ్య’. భాస్కర్ మౌర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కె. సుధాకరరెడ్డి కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను హీరోయిన్ కాజల్ అగర్వాల్ విడుదల చేసిన విషయం విదితమే. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను న్యాచురల్ స్టార్ నాని ట్విట్టర్ వేదికగా విడుదల చేశాడు. టీజర్ ఆద్యంతం మనస్సును హత్తుకుంటుంది. ఇక టీజర్ విషయానికొస్తే ” ఒక పల్లెటూరిలో నివసించే 74 ఏళ్ల ముత్తయ్యకు నాటకాలంటే పిచ్చి.. ఎప్పటికైనా సినిమాలో తనను తానూ చూసుకోవాలనే కోరిక.. చిన్నతనం నుంచి నాటకాలలో నటించడం వలన ఆ కోరిక బలంగా నాటుకుపోతుంది. తన కలనెరవేర్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు.
ఇక ఈ వృద్దుడుకు అదే ఊరిలో నివసించే ఒక యువకుడు సహాయం చేస్తుంటాడు. ముత్తయ్యను అందంగా తయారుచేసి ఫోటోలు, వీడియోలు తీసి అతని నటనను పొగిడేస్తూ ఉంటాడు. ఇక ఆ వయసులో సినిమా పిచ్చి ఉండడం వాలా ఊరిలో ముత్తయ్య ఎదుర్కున్న సమస్యలు ఏంటి..? అందరు తనను ఎగతాళి చేసిన పట్టించుకోని ముత్తయ్య చివరికి తన కల నెరవేర్చుకున్నాడా..? లేదా..? అనేది ట్విస్ట్ గా కనిపిస్తుంది. పక్కా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరక్కించిన ఈ టీజర్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. న్యాచురల్ యాక్టింగ్ తో ముత్తయ్య హృదయాలను కట్టిపడేశాడు. ఇక చివర్లో “ఏదైనా కోరిక ఉంటే దాన్ని వెంటనే తీర్చుకోవాలా.. లేదా దాన్ని అక్కడే బొంద పెట్టాలా.. ఇలా నాలెక్క వెంటపెట్టుకొని తిరగకూడదు” అని ముత్తయ్య పాత్రధారి చెప్పిన డైలాగ్ చిత్ర పరిశ్రమలోకి వచ్చే ప్రతి ఒక్కరి కలను చూపిస్తోంది. ఎంతోమంది సినిమాతెరపై కనిపించాలని ఆశపడి కుదరక ఆ ఆశలను చంపుకొని జీవిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ సినిమా అంకితం కానున్నదని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ఈ చిత్రం మే 9న యూకేలో జరగనున్న ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించనున్నారు.