‘మ్యూజిక్ ఎన్ ప్లే విత్ సాకేత్’ షో నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్ తో దూసుకుపోతోంది. ఎన్టీవీ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ లో స్ట్రీమింగ్ మొదలైన దగ్గర నుండి ప్రతి ఎపిసోడ్ సమ్ థింగ్ స్పెషల్ గా సాగిపోతోంది. ఈ ఆదివారం బ్యూటిఫుల్ సింగింగ్ కపుల్ హరిణి, సాయిచరణ్ దీనికి హాజరయ్యారు. శివరాత్రి స్పెషల్ గా ఈ ఎపిసోడ్ ను పేర్కొన్న సాకేత్… బాలుగారి స్మృతికి ఎక్కువ సమయం కేటాయించాడు.
బాలుతో బలమైన బంధం…
గాన గాంధర్వ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం నిర్వహించిన ‘పాడుతా తీయగా’లో పాల్గొన్న సాయిచరణ్, హరిణి మధ్య ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రణయంగా మారి, ఆ పైన పరిణయానికి దారితీసింది. ఇప్పుడు వాళ్ళకు ఓ బాబు! తమ పరిచయం, ప్రేమ, పెళ్ళి విశేషాలను వారితోనే చెప్పించాడు సాకేత్. అదే సమయంలో బాలుగారితో ఇద్దరికీ ఉన్న అనుబంధాన్ని అడిగి తెలుసుకున్నాడు. యూఎస్ ట్రిప్ సమయంలో తమ కోసం బాలుగారు టైమ్ స్పెండ్ చేసిన విషయాలను, డిస్నీ, యూనివర్సల్ స్టూడియోస్ ను దగ్గరుండి చూపించిన వైనాన్ని హరిణి చెప్పింది. అక్కడి ఫుట్ పాత్ మీద ఆయనతో కలిసి ఐస్ క్రీమ్ తిన్న రోజులను గుర్తు చేసుకుంది. ఇక సాయిచరణ్ యుఎస్ ట్రిప్ లో ఉన్నప్పుడు బాలుగారు పాడిన మూడు పాటలను తన లాప్ టాప్ లో రికార్డ్ చేసిన విషయాన్ని తలుచుకున్నాడు. పనిలో పనిగా బాలుగారితో తన అనుబంధాన్ని తెలియచేశాడు సాకేత్. తాను సంగీతం సమకూర్చిన తొలి చిత్రం ‘కన్నుల్లో నీరూపమే’ లో బాలు గారు పాడటమనేది సాయి చరణ్ కారణంగానే సాధ్యమైందని చెప్పాడు. అలానే తన తండ్రి రామాచారి కి సంబంధించిన ఓ రికార్డింగ్ కు బాలు గారిని దగ్గరుండి కారులో తీసుకెళ్ళినప్పటి ఫన్నీ ఇన్సిడెంట్ ను గుర్తు చేసుకున్నాడు. తమ అభ్యర్థన మేరకు బాలుగారు… భోజనానికి ఇంటికి వచ్చిన రోజుని హరిణి, సాయిచరణ్ తలుచుకుంటూ… బాలుగారు కన్నుమూసిన మూడునెలలకు పుట్టిన తమ బిడ్డకు ఆయన పేరు కలిసి వచ్చేలా పెట్టుకున్నామని చెప్పారు. ఆ సమయంలో హరిణి భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకుంది.
Read Also : Bigg Boss Non-Stop : ఫస్ట్ ఎలిమినేషన్… అనుకున్నదే అయ్యిందిగా !
నాన్ సింక్ లో సింక్!
దాదాపు ఇరవై నిమిషాల పాటు బాలు గురించి ముచ్చటించుకున్న తర్వాత అసలు ఫన్ గేమ్ ను మొదలు పెట్టాడు సాకేత్. అందులో భాగంగా ఈ క్యూట్ కపుల్ నిశ్చితార్థం, పెళ్ళి, ఫస్ట్ అవుటింగ్ కు సంబంధించిన కొన్ని ప్రశ్నలు వేశాడు. పెళ్ళిలో హరిణి కట్టుకున్న చీర రంగు చెప్పడంలో సాయి చరణ్ తడబడ్డాడు. చిత్రంగా తమ నిశ్చితార్థం జరిగిన వారం చెప్పడంలో ఇద్దరూ పప్పులో కాలేశారు. వారి నిశ్చితార్థం శనివారం జరగగా, ఇద్దరూ గురువారం అని రాసేశారు. దాంతో ‘నాన్ సింక్ లో సింక్’ అంటూ ఆటపట్టించాడు సాకేత్. ఫోటోలు చూసి పాటలను గెస్ చేసే సెగ్మెంట్ లో సాయి చరణ్ పై చేయి సాధించగా, గూగుల్ ట్రాన్స్ లేట్ చేసిన తెలుగు పాటలను గుర్తుపట్టే సెగ్మెంట్ లో హరిణి ఎక్కువ మార్కులు స్కోర్ చేసింది.
పురాణాలపై పట్టు!
ఈ ఇద్దరు భార్యాభర్తలకు పురాణాలు, సామాజికాంశాలపై బాగా పట్టుఉన్నట్టు రాపెడ్ ఫైర్ సెగ్మెంట్ లో తేటతెల్లమైంది. సతి దేవి తండ్రి పేరు? కృష్ణుడి శంఖం పేరు వంటి వాటికి కరెక్ట్ ఆన్సర్స్ చెప్పింది హరిణి. అలానే పార్వతీ దేవి ఎవరి కూతురు? గంగను భూమిపైకి తీసుకొచ్చింది ఎవరు? అనే ప్రశ్నలకు సాయి చరణ్ సరైన జవాబు చెప్పాడు. నేతాజీ అని ఎవరి పిలుస్తారని అడిగినప్పుడు నెహ్రూ అని చెప్పి, నాలుక కరుచుకుని వెంటనే సుభాష్ చంద్రబోస్ పేరు చెప్పాడు. ఇక హరిణి తనకిచ్చిన ఛాయిస్ లో రఘురామ్ ను అవాయిడ్ చేస్తానని, రాహుల్ సిప్లిగంజ్ తో అడ్జస్ట్ అవుతానని, అనురాగ్ కులకర్ణితో పాటడాన్ని ఎంజాయ్ చేస్తానని తెలిపింది. సాయిచరణ్… సాహితీ చాగంటిని అవాయిడ్ చేస్తానని, హరిణితో అడ్జస్ట్ అవుతానని, రమ్య బెహరాతో కలిసి పాడటం లవ్ చేస్తానని చెప్పాడు. విశేషం ఏమంటే…. గతంలో ఈ ప్రోగ్రామ్ కు వచ్చిన సాహితీ చాగంటి కూడా సాయిచరణ్ తో పాడటాన్ని అవాయిడ్ చేస్తానని చెప్పింది. మొత్తం మీద ఈ వారం ఎపిసోడ్ బాలు గారి స్మృతులతో కాస్తంత భారంగా, ఆ తర్వాత కాస్తంత ఫన్నీగా సాగింది. మరి ఇంకా ఆలస్యం ఎందుకూ… మీరూ ఈ క్రింది లింక్ క్లిక్ చేసి ‘మ్యూజిక్ ఎన్ ప్లే విత్ సాకేత్’ శివరాత్రి ఎపిసోడ్ చూసి ఎంజాయ్ చేసేయండి.