Music Director: విద్యాసాగర్ ‘స్వరాభిషేకం’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగునాట పుట్టి, తమిళనాట అడుగుపెట్టి, మళయాళ సీమలో తన స్వరవిన్యాసాలతో ఆకట్టుకున్న ఘనుడు మన విద్యాసాగర్. మాతృభాషలో కన్నా మిన్నగా పరభాషల్లోనే పదనిసలు పలికించి, పులకింప చేశారాయన. విద్యాసాగర్ పరభాషల్లో పలికించిన స్వరాలను మన తెలుగువారు కాపీ చేసిన సందర్భాలూ ఉన్నాయి.
కళలకాణాచిగా పేరొందిన విజయనగరంలో రామచంద్రరావు అనే సంగీతకళాకారుని తనయునిగా 1963 మార్చి 2న జన్మించారు విద్యాసాగర్. తండ్రి వద్దనే కర్ణాటక సంగీతంలో ఓనమాలు నేర్చుకున్న విద్యాసాగర్ తరువాత ఇతర గురువుల వద్ద మరింత సాధన చేశారు. ఆ పై క్లాసికల్ గిటార్ నేర్చుకోవడానికి మదరాసు చేరారు. అక్కడ మాస్టర్ ధన్ రాజ్ వద్ద గిటార్ క్లాసులు నేర్చుకున్నారు. అక్కడే ఎ.ఆర్.రహమాన్ కూడా గిటార్ నేర్చుకొనేవారు. తరువాత కొన్ని చిత్రాలకు అసోసియేట్ గా పనిచేసిన విద్యాసాగర్, ‘పూ మనం’ తమిళ చిత్రంతో సంగీత దర్శకుడయ్యారు. ఆ సినిమాలో ఆయన కంపోజ్ చేసిన “ఎన్ అన్బే ఎన్ నెంజిల్…” అంటూ సాగే పాట విశేషాదరణ చూరగొంది. తరువాత కృష్ణంరాజు హీరోగా తెరకెక్కిన ‘ధర్మతేజ’ తో తెలుగులో తొలిసారి స్వరాలు పలికించారు విద్యాసాగర్.
Also Read
తన స్వరాల్లో సంప్రదాయ సంగీతానికి పెద్ద పీట వేస్తూనే, అనువైన విధంగా నవీన బాణీలను మేళవించేవారు విద్యాసాగర్. తెలుగులో తమ్మారెడ్డి భరద్వాజ తెరకెక్కించిన ‘అలజడి’ సినిమాతో విద్యాసాగర్ కు మంచి గుర్తింపు లభించింది. ఆ తరువాత నుంచీ తమ్మారెడ్డి భరద్వాజ రూపొందించిన పలు చిత్రాలకు విద్యాసాగర్ స్వరకల్పన చేస్తూ సాగారు. తన దరికి చేరిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకున్నారు. పలు పాటలతో జనాన్ని ఆకట్టుకున్నారు. చిరంజీవి త్రిపాత్రాభినయం చేసిన ‘ముగ్గురు మొనగాళ్ళు’ చిత్రానికి విద్యాసాగర్ సంగీతం ఎస్సెట్ గా నిలచింది. ఇ.వి.వి. సత్యనారాయణ తెరకెక్కించిన “ఆమె, ఆలీబాబా అరడజను దొంగలు, తాళి” వంటి చిత్రాలలో సైతం విద్యాసాగర్ స్వరాలు భలేగా ఆకట్టుకున్నాయి. దాదాపు వంద తెలుగు చిత్రాలకు సంగీతం సమకూర్చి ఉంటారు విద్యాసాగర్. అయితే మాతృభాషలో ఎందుకనో విద్యాసాగర్ కు తగిన గుర్తింపు లభించలేదనే చెప్పాలి. తమిళ, మళయాళ భాషల్లో ఆయన స్వరాలకు విలువ పెరిగింది. యాక్షన్ హీరో అర్జున్ నటించిన పలు చిత్రాలకు విద్యాసాగర్ బాణీలు ఎస్సెట్ గా నిలిచాయి. ఒకానొక సమయంలో మళయాళ చిత్రసీమలో విద్యాసాగర్ స్వరాలతో రూపొందిన చిత్రాలే విజయవిహారం చేశాయి. అక్కడ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గానూ విద్యాసాగర్ జేజేలు అందుకున్నారు. విద్యాసాగర్ బాణీలను తెలుగు చిత్రాలకు సంగీతం సమకూర్చిన పలువురు అనుసరించేవారు.
తన ట్యూన్స్ కాపీ కొట్టి తెలుగులో ఎందరో సక్సెస్ చూసినప్పుడు మాతృభాషలో రాణించలేక పోయానే అనే బాధ కలిగేది విద్యాసాగర్ కు. ఆ సమయంలో కె.విశ్వనాథ్ నిర్దేశకత్వంలో తెరకెక్కిన ‘స్వరాభిషేకం’ చిత్రానికి సంగీతం సమకూర్చే అవకాశం విద్యాసాగర్ కు లభించింది. కె.విశ్వనాథ్ చిత్రమంటేనే సంగీతసాహిత్యాలతో అలరారిస్తుంది అనే నమ్మకం జనాల్లో ఉంది. అదీగాక, విశ్వనాథ్ కొంత గ్యాప్ తరువాత రూపొందించిన చిత్రం ‘స్వరాభిషేకం’. పైగా టైటిల్ కు తగినట్టే ఈ చిత్రంలో సంగీతానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. దీంతో విద్యాసాగర్ కూడా ఆ సినిమాను ఓ సవాల్ గా తీసుకొని సంప్రదాయ సంగీతాన్ని పలికించారు. ఆ చిత్రమే 2004లో విద్యాసాగర్ ను జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకునిగా నిలిపింది. విద్యాసాగర్ సంగీతానికి అంతకు ముందు మళయాళ, తమిళ చిత్రసీమల్లో పలు అవార్డులూ రివార్డులూ లభించాయి. తమిళనాడు ప్రభుత్వం నుండి ‘కలైమామణి’ అవార్డునూ దక్కించుకున్నారు. పలు మార్లు కేరళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులూ సంపాదించారు. అన్నిటికన్నా మిన్నగా మాతృభాషలో ‘స్వరాభిషేకం’తో జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకునిగా నిలవడమే విద్యాసాగర్ కు మహదానందం కలిగించింది.
ఆ తరువాత కూడా కొన్ని తెలుగు చిత్రాలకు విద్యాసాగర్ సంగీతం సమకూర్చారు. బాలకృష్ణ ఓ కీలక పాత్ర పోషించిన ‘ఊ కొడతారా? ఉలిక్కి పడతారా?’ చిత్రానికి కూడా విద్యాసాగర్ స్వరకల్పన చేశారు. ఎందుకనో కొంతకాలంగా విద్యాసాగర్ బాణీలు తెలుగునాట వినిపించడం లేదు. ఏది ఏమైనా ముందు రచ్చ గెలిచి, తరువాత ఇంట గెలిచిన విద్యాసాగర్ నిజంగా సంగీతసాగరుడనే చెప్పాలి.
తాజావార్తలు
-
AP: ఏపీ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నూతన కమిటీ నియామకం..
-
Giorgia Meloni: మెలోని పెళ్లెందుకు చేసుకోలేదు.. మెలోడీ వీడియో వైరల్ తర్వాత నెట్టింట తీవ్ర చర్చ
-
Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్లో పుల్వామా సూత్రధారి హతం..
-
Peddi Twist: ఢిల్లీ ఎపిసోడ్ ట్విస్ట్.. ‘ఉప్పెన’ క్లైమాక్స్ కంటే 100 రెట్లు ఎక్కువ!
-
Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. “ఎక్స్” అకౌంట్ నిలిపివేత..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!