Mundadugu Movie Completes 40 Years: తెలుగు చిత్రసీమలోనే కాదు ప్రపంచంలోనే సమస్థాయి కలిగిన ఇద్దరు స్టార్స్ ఎక్కువ చిత్రాలలో నటించడం యన్టీఆర్- ఏయన్నార్ తోనే సాధ్యమయింది. వీరిద్దరూ కలసి 14 చిత్రాలలో అభినయించారు. వారి తరువాత ఆ క్రెడిట్ శోభన్ బాబు-కృష్ణకే చెందుతుంది. మల్టీస్టారర్స్ తో యన్టీఆర్- ఏయన్నార్ కాంబో ఎక్కువ విజయాలు సాధించింది. అయితే తెలుగునాట మల్టీస్టారర్ తో ‘గోల్డెన్ జూబ్లీ’ చూసిన ఘనత మాత్రం కృష్ణ, శోభన్ బాబు నటించిన ‘ముందడుగు’ చిత్రానికే దక్కింది. సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై కె.బాపయ్య దర్శకత్వంలో డి.రామానాయుడు నిర్మించిన ‘ముందడుగు’ చిత్రం 1983 ఫిబ్రవరి 25న విడుదలయింది.
కథ విషయానికి వస్తే – ఫణిభూషణరావు, నాగేంద్ర, భుజంగం కలసి ధర్మారావు నీడన ఆయన ఛైర్మన్ గా వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ధర్మారావుకు తెలియకుండా తప్పుడు పనులు చేస్తూ ఈ ముగ్గురూ పబ్బం గడుపుకుంటూ ఉంటారు. ఈ నలుగురి పిల్లలు మంచి స్నేహితులు. భుజంగం కొడుకు కామరాజు పెళ్ళి జరుగుతూఉండగా, పెళ్ళికూతురును ఒకడు లేపుకుపోతాడు. అదే సమయంలో బాలగంగాధర తిలక్ వచ్చి, ఆ అమ్మాయిని కన్నవారికి అప్పగిస్తాడు. అయితే ఆ అమ్మాయికి ఇష్టం లేని పెళ్ళి చేయిస్తున్నారని తెలిసి, తాను అండగా నిలచి ఆమె కోరుకున్న వాడితో పెళ్ళి జరిపిస్తాడు తిలక్. అక్కడే ధర్మారావు తనయుడు చక్రవర్తితో తిలక్ మాటల యుద్ధమూ చేస్తాడు. ఫణిభూషణరావు కూతురు రాణికి ఓ పేద మాస్టారు కూతురయిన భారతి హిందీ ట్యూషన్ చెబుతూ ఉంటుంది. పేదవారంటే రాణికి అసహ్యం. అయితే ఓ సారి తిలక్ మంచితనం గురించి భారతి ద్వారా తెలుసుకొని, ఆకర్షితురాలవుతుంది. ఇక భారతిని చూడగానే ప్రేమలో పడ్డ చక్రవర్తి ఆమె వెంట పడుతూ ఉంటాడు. అది తప్పని తిలక్ నిలదీస్తాడు. అయితే ఆ తరువాత చక్రవర్తి సత్ర్పవర్తన భారతిని ఆకట్టుకుంటుంది. ధర్మారావు కంపెనీలోనే తిలక్ కు క్యాషియర్ గా ఉద్యోగం వస్తుంది. తిలక్ పై దొంగతనం మోపుతారు ఫణిభూషణరావు అతని మిత్రులు. ఆ సమయంలో ధర్మారావు, తిలక్ పై చేయి చేసుకోబోతాడు. అదే సమయానికి తిలక్ తల్లి అక్కడకు వచ్చి, తాను నోరు తెరిస్తే మీ ఆస్తులన్నీ ముక్కలవుతాయని, మీ ధనానికి దూరంగా నిజాయితీగా తన కొడుకును పెంచానని చెప్పి, తనయుడిని తీసుకు వెళ్తుంది.
తనయుడికి అసలు విషయం చెబుతుంది శారద. ధర్మారావు తమ్ముడు సత్యం కొడుకే తిలక్. ధర్మారావు, సత్యం సొంత అన్నదమ్ములే అయినా, వారి ఆలోచనల్లో తేడా ఉంటుంది. పేదవారి కోసం సత్యం పోరాడేవాడు. అన్న దగ్గర తన వాటా ఇవ్వమని సత్యం కోరతాడు. దాంతో ఇద్దరి మధ్య విభేదం తలెత్తుతుంది. సత్యం, తన భార్యతో వేరే వెళతాడు. సత్యం దగ్గరే ఫణిభూషణరావు, భుజంగం, నాగేంద్ర ఉద్యమంలో ఉంటారు. వారి కోరికమేరకు ఉన్నవారిని దోచుకొని పేదవారికి సాయం చేయాలని దోచుకుంటారు. ఆ డబ్బును తీసుకొని ఫణిభూషణరావు అతని మిత్రులు పారిపోతూ సత్యం భార్య శారదకు తారసపడి, ఆమెను గాయపరచి పోతారు. పోలీసుల కాల్పుల్లో సత్యం చనిపోయాడని ప్రచారం చేస్తారు. కానీ, అతడిని ఈ ముగ్గురే వెన్నుపోటు పొడిచి ఉంటారు.
తల్లి చెప్పిన సంగతులు తెలుసుకున్న తిలక్ ఆ ముగ్గురినీ చితకబాదతాడు. తన తండ్రిని పోలీస్ రిజిస్టర్ లో ఓ నేరస్థుడిగా చిత్రీకరించారని, అతనిని నిర్దోషిగా నిరూపిస్తానని తిలక్ శపథం చేస్తాడు. తరువాత ధర్మారావు హత్యకు గురవుతాడు. తన తండ్రిని తిలక్ చంపాడని చక్రవర్తి నమ్ముతాడు. అయితే అసలు విషయాలు తెలుసుకున్న చక్రవర్తి, తిలక్ ను శిక్షపడకుండా విడిపిస్తాడు. ఇద్దరూ కలసి ఆ ముగ్గురి భరతం పడతారు. జనాన్ని మోసం చేసి కోట్లు గడించి, దేవాలయంలో పుట్టలో దాస్తూ ఉంటారు ఆ ముగ్గురు. ఆ ధనం చుట్టూ పాములు ఉంటాయి. అవే ఫణిభూషణరావును మట్టుపెడతాయి. మిగిలిన వారిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. చక్రవర్తి తమ ఆస్తులన్నీ కార్మికుల పరం చేయడంతో కథ సుఖాంతమవుతుంది.
శోభన్ బాబు, కృష్ణ, శ్రీదేవి, జయప్రద, సత్యనారాయణ, రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య, చలపతిరావు, గిరిబాబు, నూతన్ ప్రసాద్, ప్రభాకర్ రెడ్డి, శివకృష్ణ, అన్నపూర్ణ, రావి కొండలరావు, రాధాకుమారి ముఖ్యపాత్రధారులు. అయితే ఇందులో వీరెవరి పేర్లూ టైటిల్ కార్డ్స్ లో కనిపించవు. అప్పట్లో శోభన్, కృష్ణకు ఉన్న స్టార్ ఇమేజ్ దృష్ట్యా ఎవరి పేర్లు ముందు వేయాలో తోచక నటీనటులందరికీ నిర్మాత కృతజ్ఞతలు తెలియజేస్తూ కార్డ్ వేశారు. ఈ చిత్రానికి కథ, మాటలు పరుచూరి బ్రదర్స్ అందించారు. వారి మాటలు పలు సన్నివేశాల్లో ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకున్నాయి. అంతకు ముందు పురాణగాథలను సాంఘికాలకు అనువుగా కథలు మలచడంలో యన్టీఆర్, దాసరి నారాయణరావు వంటి దర్శకులు అలరించారు. వారి పంథాలోనే పయనిస్తూ ఈ కథలోని సన్నివేశాలు రూపొందించారు పరుచూరి బ్రదర్స్. ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతం సమకూర్చగా, వేటూరి పాటలు పలికించారు. ఇందులోని “నాకొక శ్రీమతి కావాలి…”, “ప్రేమకు నేను పేదను కాను…”, “చిలకలూరి పేటకాడ చిలకా…”, “ఏ తల్లి కన్నదో నిన్ను…”, “పోరా నా కంతిరి మావా…”, “వేయిపడగలపైన…” అంటూ సాగే పాటలు అలరించాయి.
ఈ సినిమా 12 కేంద్రాలలో డైరెక్ట్ గా శతదినోత్సవం జరుపుకుంది. మొత్తం ఇరవై కేంద్రాలలో వంద రోజులు చూసింది. హైదరాబాద్ సంధ్య 70 ఎమ్.ఎమ్.లోనూ, విజయవాడ అప్సర థియేటర్ లోనూ డైరెక్ట్ జూబ్లీ జరుపుకొని 1983 టాప్ గ్రాసర్ గా నిలచింది. హైదరాబాద్ లో షిఫ్ట్ మీద ఈ సినిమా గోల్డెన్ జూబ్లీ చూసింది. సురేశ్ ప్రొడక్షన్స్ లో తొలి గోల్డెన్ జూబ్లీగానూ ‘ముందడుగు’ నిలచింది. ఈ చిత్రాన్ని 1984లో రాజేశ్ ఖన్నా, జితేంద్ర, శ్రీదేవి, జయప్రద కలయికలో ‘మక్సద్’ పేరుతో హిందీలో రీమేక్ చేశారు. ఆ చిత్రాన్నీ కె.బాపయ్య దర్శకత్వంలోనే డి.రామానాయుడు నిర్మించారు. అక్కడ కూడా ఈ సినిమా సిల్వర్ జూబ్లీ జరుపుకోవడం విశేషం!