M.S Raju : ‘అగధ’ కంటెంట్ చూసి ‘ఈ సారి కొడుతున్నారు సార్’ అని మహేష్, ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రభాస్ అన్నారు!

Ms Raju

Ms Raju

శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మాణంలో, అజయ్ కేఆర్ సమర్పణలో సీనియర్ మేకర్ ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ ‘అగధ’. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్, భాను చందర్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు ఎం.ఎస్. రాజు మీడియాతో ముచ్చటించి పలు ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు.

టైటిల్ గురించి ఎం.ఎస్. రాజు మాట్లాడుతూ — “అగధ అంటే లోతైన అంశం లేదా ఓ శూన్యం అని అర్థం. దేవుడు, దెయ్యం అనే ఫోర్స్‌ల మధ్య జరిగే కథ ఇది. దేవుడికి వ్యతిరేకంగా పనిచేసే ఒక దుష్టశక్తిని ఇందులో ‘అగధ’గా చూపించాం. శ్యాం ప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్లు ఇది కేవలం భయపెట్టే హారర్ సినిమా మాత్రమే కాదు, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు ఇందులో ఉన్నాయి. రియాలిటీకి నా ఫ్యాంటసీ జోడించి ప్రతి ఒక్కరికీ నచ్చేలా తీశాను” అని తెలిపారు.

ఈ సినిమా కంటెంట్, టీజర్ చూసి స్టార్ హీరోలు స్పందించిన తీరుపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. “టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత మహేష్ బాబు గారు నాకు వాయిస్ మెసేజ్ చేస్తూ ‘ఈసారి కొడుతున్నారు సార్’ అన్నారు. ఇక ప్రభాస్ అయితే ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రశంసించారు. నా హీరోలు, వారి అభిమానులు ఎప్పుడూ నాకు అండగా ఉంటారు” అని వివరించారు.