బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో దర్శకుడు అయాన్ ముఖర్జీకి ఓ ప్రత్యేక అనుబంధం ఉంది. అయాన్ తొలి చిత్రం ‘వేకప్ సిద్’ 2009లో వచ్చింది. అందులో హీరో రణబీర్ కపూర్. ఆ తర్వాత నాలుగేళ్ళకు అంటే 2013లో అయాన్ రెండో సినిమా ‘యే జవానీ హై దివానీ’ వచ్చింది. అందులోనూ రణబీరే హీరో. ఇప్పుడు ఏకంగా తొమ్మిదేళ్ళ తర్వాత అయాన్ ముఖర్జీ మూడో సినిమా ‘బ్రహ్మస్త’ రాబోతోంది. ఇందులోనూ రణబీర్ కపూరే హీరో. ఈ విషయం గురించి అయాన్ ను ప్రశ్నించినప్పుడు అతను ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. ”రణబీర్ కపూర్ తో వృత్తిపరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ ఎంతో అనుబంధం ఉంది. అతన్ని తప్ప నా కథలకు వేరే వారిని హీరోలుగా ఊహించుకోలేను. ఇప్పుడీ ‘బ్రహ్మాస్త్ర’ను మూడు భాగాలుగా తీస్తున్నాను. అంటే రాబోయే రెండు భాగాల్లోనూ రణబీర్ కపూరే నా హీరో. అంటే వరుసగా నేను డైరెక్ట్ చేసిన ఐదు సినిమాలలో అతనే హీరో అన్నమాట. భవిష్యత్తులోనూ నా చిత్రాలలో అతనే హీరోగా నటించాలని కోరుకుంటున్నాను. ఒకవేళ మరీ కుర్రాడికో లేదా మరీ ముసలాడికో సంబంధించిన కథ రాసుకుంటే అప్పుడు ఎవరితో తీయాలా అని ఆలోచిస్తాను. ఒకవేళ ఆ పాత్రలు కూడా రణబీర్ పోషిస్తానంటే అతనితోనే ఆ సినిమాలూ తీస్తాను” అని చెప్పాడు అయాన్ ముఖర్జీ.