విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కలయికలో వస్తున్న ‘లైగర్’ నుంచి శనివారం కొత్త పిక్ రిలీజ్ చేశారు. బాక్సర్ గా నటిస్తున్న విజయ్ దేవరకొండ సిక్స్ ప్యాక్ న్యూడ్ బాడీతో కూడిన ఈ పిక్ లో తన నగ్నశరీరాన్ని గులాబీపూల బొకేతో కప్పినట్లు చూపించారు. ఈ పిక్ లో విజయ్ ఫ్యాన్స్ ని ఖుషీ చేసినప్పటికీ సామాన్య జనం మాత్రం కాపీ పిక్ అని ఫీలవుతున్నారు. బాక్సర్ కి ఈ పిక్ కు సంబంధం ఏమిటని భావిస్తున్నప్పటికీ డైరెక్టర్ పూరి కావటంతో తప్పకుండా సినిమాలో కీలకమైన సన్నివేశం అయివుండవచ్చని భావిస్తున్నారు.
గతంలో అమీర్ ఖాన్ ‘పికె’ సినిమాలో తన నగ్నదేహాన్ని ట్రాన్సిస్టర్ తో కవర్ చేసిన పిక్ ని పోస్టర్ గా రిలీజ్ చేశాడు. అయితే అందులో తను దుస్తులతో సంబంధం లేని గ్రహాంతర దేశం నుండి వచ్చిన వింతజీవి. దాంతో దానిని ఎవరూ తప్పుగా ఫీలవలేదు. అయితే విజయ్ దేవరకొండ న్యూడ్ ట్రీట్ పై మాత్రం మిశ్రమంగా స్పందిస్తున్నారు. హైప్ కోసం చేస్తున్న ప్రయత్నమనే వారూ లేకపోలేదు. ఇక ‘పికె’ తర్వాత సంపూర్నేష్ బాబు తన ‘క్యాలీఫ్లవర్’ సినిమాకోసం స్పూఫ్ చేస్తూ నగ్న శరీరాన్ని క్యాలీఫ్లవర్ తో కవర్ చేసిన పిక్ రిలీజ్ చేసి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఆ సినిమా సోదిలో లేకుండా పోయింది.
పూరి ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత తీస్తున్న సినిమా కావటంతో పాటు పూరి, విజయ్ కలయికలో వస్తున్న పాన్ ఇండియా సినిమా ‘లైగర్’ కావటం, ఈ బాక్సింగ్ మూవీ ‘లైగర్’లో మైక్ టైసన్ నటించటం వంటివి ఆకట్టుకునే అంశాలే. అయితే ఎందుకో ఏమో కానీ ఈ సినిమాకు రావలసినంత బజ్ మాత్రం రాలేదు. ఆగస్ట్ రిలీజ్ కి సిద్ధమవుతున్న తరుణంలో ఏదో విధంగా పూర్తి స్థాయి బజ్ కోసం యూనిట్ తంటాలు పడుతోంది. తన టేకింగ్ తో హీరోలకు స్టార్ డమ్ తీసుకువచ్చే పూరి విజయ్ తొలి పాన్ ఇండియా సినిమాకు ఏవిధంగా హైప్ తీసుకువస్తాడో చూడాలి.