షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సీరిస్ లతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న హర్ష నర్రా హీరోగా పరిచయమైన సినిమా ‘మిస్సింగ్’. ఇదే సినిమాతో శ్రీని జోస్యుల సైతం దర్శకుడిగా తన అదృష్టం పరీక్షించుకున్నాడు. భాస్కర్ జోస్యుల, లక్ష్మీ శేషగిరి రావు సంయుక్తంగా నిర్మించిన ‘మిస్సింగ్’ మూవీ శుక్రవారం జనం ముందుకు వచ్చింది.
సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేసే గౌతమ్ (హర్ష నర్రా), శ్రుతి (నికీషా రంగ్వాలా)ని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. తొలుత శ్రుతి ఫ్యామిలీ మెంబర్స్ ఈ పెళ్ళికి నిరాకరించినా, అనాథ అయిన గౌతమ్ మంచితనంతో చివరకు అంగీకరిస్తారు. అయితే పెళ్ళైన కొద్ది రోజులకే గౌతమ్, శ్రుతి కారులో వెళుతుండగా, యాక్సిడెంట్ అవుతుంది. తీవ్రగాయాల పాలైన గౌతమ్ ను హాస్పిటల్ లో అడ్మిట్ చేస్తారు. అదే సమయంలో కారులో ఉన్న శ్రుతి మాత్రం మిస్ అవుతుంది. ఆమె ఎలా మిస్ అయ్యింది? దానికి కారకులెవరు? ఆమెను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? అనేదే మిగతా సినిమా.
సహజంగా ఏ కొత్త దర్శకుడైనా ఇవాళ ఉన్న పరిస్థితిలో లవ్ జానర్ మూవీ చేసి సేఫ్ గేమ్ ఆడాలని భావిస్తాడు. కానీ శ్రీని జోస్యుల అందుకు భిన్నంగా థిల్లర్ జానర్ ను ఎంపిక చేసుకున్నాడు. అదే సమయంలో కుటుంబ కథనూ అందులో మిళితం చేసి, దీన్నో ఫ్యామిలీ డ్రామాగా మలిచాడు. పెళ్ళైన కొద్ది రోజులకే భార్య మాయమయ్యే కథాంశాలతో గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి. అందులో తాళికట్టిన భర్తనే అనుమానించే చిత్రాలూ ఉన్నాయి. ఈ సినిమాలోనూ కొన్ని సన్నివేశాలు అలాంటి సందేహాలకు తావిస్తాయి. కానీ డైరెక్టర్ తెలివిగా ప్రేక్షకుల ఊహకు కూడా అందకుండా కథను నడిపించాడు. ప్రథమార్థంలో కథ ఎంతకూ ముందుకు సాగకపోవడం కాస్తంత ఇబ్బందిని కలిగించినా, ద్వితీయార్థంలో ఊహించని మలుపులతో రేసీగా సాగింది. దానికి తగ్గట్టుగానే ఇంట్రర్వెల్ లో ఓ ఊహించని ట్విస్ట్ నూ ఇచ్చాడు డైరెక్టర్. హీరో నేపథ్యానికి సంబంధించిన సన్నివేశాలు, హీరోయిన్ ను సెర్చ్ చేస్తూనే హీరో రివేంజ్ తీర్చుకోవడం వంటివి కొత్తగా ఉన్నాయి. ఈ తరహా సినిమాలకు మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అనేది ప్రధానం. అజయ్ అరసాడ సంగీతం, డి. జానా సినిమాటోగ్రఫీ బాగున్నాయి. సినిమా నిడివి విషయంలో కొంత జాగ్రత్త పడాల్సింది. కొన్ని సన్నివేశాలను పరిహరించి, ఫాస్ట్ గా మూవీ సాగేలా చేయాల్సింది. అయినా పరిమితమైన బడ్జెట్ లో వీరంతా మంచి అవుట్ పుట్ నే ఇచ్చారు.
నటీనటుల విషయానికి వస్తే ‘ఆకాశమంత ప్రేమ’ షార్ట్ ఫిలిమ్ తో పాటు ‘ముద్దపప్పు ఆవకాయ్’, ‘పెళ్ళిగోల’ వెబ్ సీరిస్ లతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న హర్ష తొలిసారి ఇందులో హీరోగా నటించాడు. తొలి చిత్రంలోనే డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రను ఛాలెంజ్ గా తీసుకుని చేశాడు. ఇక హీరోయిన్ శ్రుతిగా నికీషా రంగ్వాలా ఫర్వాలేదనిపిస్తుంది. జర్నలిస్ట్ గా మరో కీలకమైన పాత్రను ‘తెల్లవారితే గురువారం’ ఫేమ్ మిషా నారంగ్ పోషించింది. ఆ పాత్రకు ఆమె చక్కటి న్యాయం చేకూర్చింది. ఇందులో మరో కీలకమైన ఏసీపీ త్యాగి పాత్రలో రామ్ దత్ ఆకట్టుకున్నాడు. అతని లుక్ కూడా బాగుంది. హీరోయిన్ బ్రదర్ గా విష్ణు విహారి, హీరో స్నేహితుడిగా అశోక్ వర్థన్ చక్కగా నటించారు. ఇతర ప్రధాన పాత్రలను సూర్య, ‘ఛత్రపతి’ శేఖర్, వినోద్ నువ్వుల తదితరులు పోషించారు.
సినిమా టైటిల్స్ సమయంలోనూ ‘అపరిచితుడు’ మూవీ సీన్స్ చూపించిన దర్శకుడు, ఈ కథలో తాను డీల్ చేయబోతున్న విషయాన్ని చూచాయగా తెలిపాడు. అదే సమయంలో స్టోరీలోని మల్టీలేయర్స్ ను సరళంగా చూపడంలో కాస్తంత తడబడ్డాడు. అయినా, రొటీన్ కు భిన్నంగా ఉన్న ‘మిస్సింగ్’, థిల్లర్ జానర్ చిత్రాలను ఇష్టపడే వారికి నచ్చే ఆస్కారం ఉంది. భారీ అంచనాలు పెట్టుకోకుండా ఓసారి చూడొచ్చు. కరోనా సెకండ్ వేవ్ తాలూకు భయాందోళనల నుండి జనం ఇంకా బయటపడని ఈ తరుణంలో ఇలాంటి చిన్న సినిమాలను థియేటర్లలో కంటే ఓటీటీలో విడుదల చేస్తే బాగుంటుంది.
ప్లస్ పాయింట్స్
కథలోని కొత్తదనం
ఊహకందని ట్విస్టులు
సాంకేతిక నిపుణుల పనితనం
మైనెస్ పాయింట్స్
నిదానంగా సాగే ప్రథమార్ధం
కన్ఫ్యూజ్ చేసే స్క్రీన్ ప్లే
రేటింగ్ : 2.5/5
ట్యాగ్ లైన్: రివేంజ్ డ్రామా!