అందగత్తె ఆటకు వందనాలు అంటారు కానీ, అసలు అందగత్తె నోటి నుండి జారే ప్రతిమాటకు సాహో అంటూ సాగిలపడేవారు ఉంటారు. ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ కిరీటం సొంతం చేసుకున్న రాజస్థాన్ ముద్దుగుమ్మ నందినీ గుప్తకు అప్పుడే బాలీవుడ్ ఎర్రతివాచీ పరిచేస్తోంది. మణిపూర్ లో జరిగిన ‘ఫెమినా మిస్ ఇండియా 2023’ ఈవెంట్ లో ఎంతోమంది సినీప్రముఖులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. గతంలో ఈ ఈవెంట్ లో విన్నర్స్ గానూ, రన్నర్స్ గానూ నిలచిన భామలు సైతం ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని తమ ఆటలతో అలరించారు. వారందరికీ జనం వందనాలు చేశారు. అయితే తాజాగా మిస్ ఇండియా వరల్డ్ కిరీటం నెత్తిన పెట్టుకున్న నందినీ గుప్త మాటకే జేజేలు పలికారు అక్కడి జనం. కొందరు సినిమాల్లో నటిస్తావా? ఎవరి సినిమాల్లో నటిస్తారు? ఇలాంటి ప్రశ్నలు సంధించారు.
సినిమా రంగం గురించి ఇప్పుడే ఏమీ ఆలోచించలేదని, అయితే తనకూ సినిమాలంటే ఎంతో ఇష్టమనీ చెప్పింది నందిని. తనకు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ చిత్రాల్లోని కథ, కథనంతో పాటు, ఆయన సన్నివేశాలను తెరకెక్కించే తీరు భలేగా ఆకట్టుకుంటుందని తెలిపింది. ముఖ్యంగా భన్సాలీ రూపొందించిన ‘దేవ్ దాస్’, ‘బ్లాక్’, ‘గుజారిస్’ చిత్రాల్లోని సీన్స్ అచ్చు పెయింటింగ్స్ లా ఉంటాయనీ ఆమె అభిప్రాయపడింది. పరవాలేదు అమ్మడికి కాసింత అభిరుచి ఉందని బాలీవుడ్ బాబులు అంటున్నారు. ఇంతకూ అమ్మాయిగారు ఏ సినిమాలో తెరపై తళుక్కుమంటారో చూడాలి.