కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి జంటగా నటించిన ‘సమ్మతమే ‘ మూవీ ఈనెల 24న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్‌రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే రవీందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు సమ్మతమే అంటూ మంచి టైటిల్ పెట్టడం సంతోషించదగ్గ విషయం అని ప్రశంసించారు. ఈ మూవీ ప్రొడ్యూసర్ ప్రవీణా వెంకట్‌రెడ్డి, హీరో కిరణ్, హీరోయిన్ చాందినీలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇటీవల తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోందని.. ఇది మంచి శుభపరిణామం అని తలసాని అభిప్రాయపడ్డారు. బాహుబలి, పుష్ప, ఆర్.ఆర్.ఆర్ వంటి పాన్ ఇండియా సినిమాలు తెలుగు సినిమా స్థాయిని పెంచాయని కొనియాడారు.
వరుసగా పాన్ ఇండియా సినిమాలు వస్తున్న సమ్మతమే లాంటి చిన్న సినిమాలు రావడం కూడా తెలుగు సినిమాకు చాలా అవసరమన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సమ్మతమే లాంటి సినిమాను అందిస్తున్న యంగ్ డైరెక్టర్ గోపీనాథ్‌కు అభినందనలు తెలిపారు. ఆయన చాలా టాలెంట్ ఉన్న వ్యక్తి అని.. టాలెంట్ ఉంటే ఏదైనా సాధించడానికి ఉపయోగపడుతుందని మంత్రి తలసాని అభిప్రాయపడ్డారు. తెలుగు సినీ పరిశ్రమలో చాలా మంది అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారని.. అయితే టాలెంట్ ఉంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయన్నారు. ఈ సినిమాతో హీరో కిరణ్ అబ్బవరానికి బ్రహ్మాండమైన పేరు వస్తుందని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నుంచి విడుదల చేయడం యూనిట్ సభ్యులకు కలిసొస్తుందని పేర్కొన్నారు. మహిళా నిర్మాత ప్రవీణా వెంకట్‌రెడ్డి భవిష్యత్‌లో మరిన్ని సినిమాలు నిర్మించాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ భారతదేశంలోనే ఓ హబ్‌గా తయారైందని.. అందులోనూ హైదరాబాద్ నగరం సినిమా ఇండస్ట్రీకి అనువుగా ఉండటం చాలా సంతోషకర విషయమన్నారు. సినిమా ఇండస్ట్రీకి ఎలాంటి అవసరం ఉన్నా తెలంగాణ ప్రభుత్వం అండదండలు అందిస్తుందని తలసాని అన్నారు. సమ్మతమే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగడానికి దేవరకొండ ఎమ్మెల్యే రవీందర్ చాలా కృషి చేశారని.. ఈ విషయంలో ఆయన్ను అభినందించాలన్నారు. ఈ మూవీ సక్సెస్ మీట్‌లో ఈ యూనిట్‌ను తాము మరోసారి కలుస్తామని తలసాని తెలిపారు.
https://www.youtube.com/watch?v=RbSLlVGcn-M