టాలీవుడ్ లో గత కొన్ని నెలలుగా సినిమా టిక్కెట్ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమస్యను తన భుజాలపై వేసుకొని మెగాస్టార్ చిరంజీవి, సినీ ప్రముఖులను వెంటబెట్టుకొని గురువారం సీఎం జగన్ తో భేటీ అయిన విషయం విదితమే. ఇక ఈ భేటీకి టాలీవుడ్ పెద్దలు రాలేదని, ముఖ్యంగా నిర్మాత, నటుడు మంచు మోహన్ బాబు హాజరుకాలేదని సినీ అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే మోహన్ బాబు ఎందుకు రాలేదు అనే ఆరా తీస్తుండగానే మినిస్టర్ పేర్ని నానిని ఇంటికి పిలిచి ఆతిధ్యం ఇచ్చి షాక్ ఇచ్చారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్ వచ్చిన మంత్రి పేర్ని నాని.. మోహన్ బాబు ఇంటికి వెళ్లారు. అక్కడ మోహన్ బాబు, మా ప్రెసిడెంట్ విష్ణుతో కలిసి టికెట్ వివాదంతో కీలక చర్చలు కొనసాగించారు. అంతేకాకుండా గురువారం సీఎం జగన్ భేటీకి రాలేకపోయింది మోహన్ బాబుకు అక్కడ జరిగిన విషయాలను వివరించారు.
ఇక ఈ విషయాన్ని మంచు విష్ణు ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ” ఈరోజు మా ఇంట్లో మీకు ఆతిథ్యం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది నాని గారు. టిక్కెట్ ధరపై మీరు చూపిన చొరవ మరియు తెలుగు చిత్ర పరిశ్రమ కోసం ఆంధ్రప్రదేశ్ చేపట్టిన కొత్త పథకాలను మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. తెలుగు చిత్ర పరిశ్రమ ప్రయోజనాలను కాపాడినందుకు చాలా ధన్యవాదాలు” అంటూ ట్వీట్ చేశాడు. ఇక నిన్నటి నుంచి మంచు ఫ్యామిలీ ఎక్కడ అనే ప్రశ్నకు ఒక్క ట్వీట్ తో విష్ణు సమాధానం చెప్పాడని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.