Michelle Dockery: ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు టామ్ హ్యాంక్స్ చిత్రంలో అవకాశం లభించిందంటే నటీనటులు ఎంతగానో పులకించి పోతారు. ఎందుకంటే హాలీవుడ్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా నేడు మహానటులుగా వెలుగొందుతున్న వారిలో టామ్ హ్యాంక్స్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఆయన నటించిన ‘ఫారెస్ట్ గంప్’ ఆధారంగానే ఆమిర్ ఖాన్ ఇటీవల ‘లాల్ సింగ్ చద్దా’ తెరకెక్కించారు. మరో మహానటుడు స్పెన్సర్ ట్రేసీ తరువాత వరుసగా రెండేళ్ళు ఉత్తమ నటునిగా ఆస్కార్ అందుకున్న ఘనత టామ్ హ్యాంక్స్ సొంతం. ట్రేసీ 1937లో ‘కెప్టెన్స్ కరేజియస్’తోనూ, 1938లో ‘బాయ్స్ టౌన్’తోనూ ఉత్తమనటునిగా ఆస్కార్ ను అందుకున్నారు. ఆయన తరువాత 56 ఏళ్ళకు ఆ ఫీట్ ను సాధించిన ఘనత టామ్ హ్యాంక్స్ సొంతమయింది. 1993లో ‘ఫిలడెల్ఫియా’తోనూ, 1994లో ‘ఫారెస్ట్ గంప్’తోనూ టామ్ ఉత్తమ నటునిగా నిలిచారు. అంతటి పేరున్న టామ్ హ్యాంక్స్ తాజా చిత్రం ‘హియర్’లో నాలుగు సార్లు ఎమ్మీ అవార్డు నామినేషన్స్ సంపాదించిన నటి మిచెల్లీ డాకరీ నటిస్తోంది.
మన దేశంలో గ్రాఫిక్ నావల్స్ కు అంతగా క్రేజ్ లేదు కానీ, అమెరికాలో భలే డిమాండ్ ఉంది. రిచర్డ్ మ్యాక్ గిరే గ్రాఫిక్ నావల్ ‘హియర్’ ఆధారంగా టామ్ హ్యాంక్స్ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో కీలక పాత్రలో మిచెల్లీ డాకరీ కనిపించబోతోంది. “డౌన్ టౌన్ అబ్బే, డిఫెండింగ్ జాకబ్, గుడ్ బిహేవియర్, గాడ్ లెస్” వంటి చిత్రాలలో నటించిన మిచెల్లీ, టామ్ తో కలసి నటించడం అనగానే ఎగిరి గంతేసి మరీ ఈ సినిమాను అంగీకరించిందట! ఫ్యామిలీ డ్రామాతో నడిచే ఈ కథలో మిచెల్లి పాత్ర పలు షేడ్స్ లో కనిపించనుందట! నటిగా ఈ పాత్ర తనకు ఓ ఛాలెంజ్ లాంటిదని మిచెల్లి భావిస్తోంది. మరి టామ్ హ్యాంక్స్ తో ఏ తీరున మిచెల్లి పోటీపడి నటిస్తుందో చూడాలి.