దివంగత నటుడు, కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ చివరి చిత్రం “జేమ్స్” విడుదలకు సిద్ధంగా ఉంది. పునీత్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 17న ఈ మూవీ భారీ ఎత్తున విడుదల కానుంది. సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో పునీత్ ను తలచుకుంటూ మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. “జేమ్స్” చిత్రం సూపర్ హిట్ కావాలని కోరుకుంటూ ఓ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. “ప్రియమైన అప్పూ… ఓ రోజు ఉదయాన్నే అనూహ్యంగా నువ్వు మమ్మల్ని విడిచి వెళ్ళిపోయావు. ఈ విషయాన్ని మేము ఇంకా నమ్మలేకపోతున్నాము. ఇప్పుడు నువ్వు నటించిన ఆఖరి చిత్రం “జేమ్స్” ఈ నెల 17న విడుదల అవుతోంది. ఈ సందర్భం మమ్మల్ని ఎంతో భావోద్వేగానికి గురి చేస్తోంది. మరోవైపు నీ ఆఖరి చిత్రం మమ్మల్ని అలరించబోతోంది. కానీ ఈ సమయంలో నువ్వు మాతో లేవన్న విషయం కలచివేస్తోంది” అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. “నీ మధుర స్మృతులు మా మనసులో ఎప్పుడూ ఎన్ స్వచ్ఛమైన నవ్వు అంత పదిలంగా ఉంటాయి… ఆల్ ది వెరీ బెస్ట్” అని చెప్పుకొచ్చారు.
Read Also : The Kashmir Files : అప్రతిష్టపాలు చేసేందుకు కుట్ర… ప్రధాని సంచలన వ్యాఖ్యలు
“జేమ్స్”ను పునీత్ అన్నలు రాఘవేంద్ర రాజ్‌కుమార్, శివరాజ్‌కుమార్ నిర్మించడమే కాకుండా అతిధి పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి పునీత్ డబ్బింగ్ ను శివరాజ్ కుమార్ చెప్పారు. ప్రియా ఆనంద్ కథానాయికగా నటించింది. దివంగత నటుడు పునీత్ కు గౌరవసూచకంగా ఆయన పుట్టినరోజున “జేమ్స్”ను మార్చ్ 17న థియేటర్‌లలో విడుదల చేయనున్నారు. అంతేకాదు కర్ణాటక మూవీ డిస్ట్రిబ్యూటర్లు మార్చి 17 నుండి 23 వరకు వారానికి ఏ చిత్రాన్ని విడుదల చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఇక ‘జేమ్స్’ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా విడుదల కానుంది.