Chiranjeevi: బాలనటుడిగా ఇండస్ట్రీకి వచ్చి హీరోగా మారాడు తేజా సజ్జా.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా హనుమాన్ సినిమాతో తన అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు.ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కె.నిరంజన్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ.. కథ, దర్శకత్వం వహించాడు. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా 12 భాషల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతోనేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ గ్రాండ్ గా నిర్వహించారు. ఇక ఆ ఈవెంట్ కు చిరంజీవి గెస్ట్ గా విచ్చేశాడు.
ఇక ఈ ఈవెంట్ లో చిరు మాట్లాడుతూ.. ” ఈ రోజు ఇలా రావడానికి నాలుగు కారణాలున్నాయి. నేను హనుమంతుడి భక్తుడ్ని. అన్నీ తానే అని నమ్మిన వాడిని అలాంటి ఆంజనేయుడి మీద సినిమా తీస్తే నేను రాకుండా ఉంటానా.. అదొక కారణం అయితే.. డైపర్లు వేసుకున్న స్థాయి నుంచి నా ముందే డయాస్‌లు ఎక్కి వచ్చిన తేజ మరొక కారణం. టీజర్, ట్రైలర్ చూస్తే విజువల్స్, సౌండింగ్ అన్నీ బాగున్నాయి. ఆ దర్శకుడు ఎవరని తెలుసుకున్నా.. ప్రశాంత్ వర్మ.. అతనికోసం వచ్చాను. ఫైనెస్ట్ సినిమా అవుతుంది. వీళ్లు వచ్చి నన్ను ఈవెంట్‌కు రమ్మని అడిగారు. వెంటనే వస్తాను అని అన్నాను. నా ఆరాధ్య దైవం గురించి ఎక్కువగా చెప్పుకునే సందర్భాలు రాలేదు. మనలో ఉన్న భక్తిని చెప్పుకోవాలా? అని అనిపిస్తుంది.. కానీ ఒక్కోసారి చెప్పుకోవాలని అనిపిస్తుంది అంటూ తన జీవితంలో హనుమంతుడు చేసిన ఎన్నో అద్భుతాలను చెప్పుకొచ్చాడు.
” నాన్నగారు కమ్యూనిస్టు. దేవుడి ఫోటోలకు కూడా దండంపెట్టేవాడు కాదు. మా అమ్మ కోసం అప్పడప్పుడు తిరుమలకు వెళ్లి వచ్చేవాళ్లం. నేను హనుమంతుడిని బాగా నమ్మేవాడిని.. రోడ్డు మీద ఓ సారి ఆట ఆడితే.. క్యాలెండర్ వచ్చింది.. అందులో ఆంజనేయుడి ఫోటో ఉంటుంది. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు నా వద్దే ఉంది. ఆయన వెంట నేను పడ్డానా? నా వెంట ఆయన పడ్డాడా? తెలియకుండా ఆయనతో నా అనుబంధం కొనసాగుతూ వచ్చింది.. మా నాన్నకు కూడా నేను హనుమంతుడిని పరిచయం చేశాను. కమ్యూనిస్ట్ భావాలు, నాస్తికుడ్ని అయిన మా నాన్న గారు భక్తుడిగా మారారు. పేరాలలో మేము ఉన్న ఇంటి పెరట్లో ఓ కాయిన్ దొరికింది. దాని మీద హనుమంతుడి బొమ్మ ఉంది. దాన్ని లాకెట్‌గా చేసి మా నాన్న గారు నా మెడలో వేశారు. ఆ తరువాత చెన్నైకి వెళ్లాను. వరుసగా ఆఫర్లు వచ్చాయి. ఆయనే నా వెంట ఉండి నడిపించారు. ఇలా అన్ని సందర్బాల్లో హనుమంతుడు నాకు అండగా ఉన్నాడు. నన్ను కాపాడుతున్న అతీత శక్తి హనుమాన్ ” అని ఎన్నో సంఘటనలను చెప్పుకొచ్చాడు.
ఇక హనుమాన్ సినిమా రిలీజ్ గురించి, థియేటర్ల గురించి చిరు మాట్లాడుతూ.. ” ఇది పరీక్షా కాలం. థియేటర్లు అంతగా లభించకపోవచ్చు. కానీ కంటెంట్ బాగుంటే ఎప్పుడైనా సరే సినిమాలు చూస్తారు. అందరి సినిమాలు బాగా ఆడాలి. 2016లో ఖైదీ నెంబర్ 150, బాలకృష్ణ సినిమాలు వచ్చాయి. దిల్ రాజు ఆ టైంలో శతమానంభవతిని రిలీజ్ చేశారు. కంటెంట్ బాగుంటే ఆడుతుందని ఆ రోజు అన్నారు. హనుమాన్ కూడా అలానే ఆడుతుంది” అని చెప్పుకొచ్చాడు. ఇక సినిమాలో నటించిన గురించి చిరు మాట్లాడాడు. ఇక చివర్లో రామ మందిర ప్రారంభోత్సం వేళ హను-మాన్ చిత్ర బృందం కీలక ప్రకటన చేసిన విషయం గురించి కూడా చిరు మాట్లాడాడు. తమ సినిమాకు వచ్చే వసూళ్లలో ప్రతి టికెట్ పై రూ.5 రామ మందిర నిర్మాణానికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయం చాలా అద్భుతమని ప్రశంసించాడు.