Manasa: తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2లో ఎలిమినేషన్స్ మొదలైపోయాయి. గత వారం బెంగళూరుకు చెందిన యుతి ఎలిమినేట్ కాగా ఈ వారం హైదరాబాద్ కు చెందిన మానస పోటీ నుండి తప్పుకుంది. గత శుక్ర, శనివారాల్లో ‘స్వాగ్ విత్ బాబా సెహగల్’ పేరుతో ధూమ్ ధామ్ గా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 కార్యక్రమం జరిగింది. ఈ రెండు రోజుల్లో 11 మంది కంటెస్టెంట్స్ ‘పాట వైపు నా మొదటి అడుగు’ అనే కాన్సెప్ట్ ను బేస్ చేసుకుని పాటలు పాడారు. విశాఖకు చెందిన సాయి సౌజన్య పాడిన పాటను తమన్ శ్రేయా ఘోషల్ కు పంపడంతో… ఆమె సౌజన్యను అప్రిషియేట్ చేస్తూ ఓ వీడియో పంపింది. అలానే ప్రణతి పాడిన ‘సార్’ మూవీలోని గీతాన్ని విని ఫిదా అయిపోయిన జీవీ ప్రకాశ్ కుమార్ ఆమెను అభినందిస్తూ వీడియో పంపాడు. ఇదే వేదిక మీద ప్రణతి తండ్రితో కలిసి ‘అమృత’ మూవీలోని ‘ఏ దేవి వరము నీవో…’ గీతాన్ని అలపించింది. అది ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ పెర్ఫార్మెన్స్ అంటూ న్యాయనిర్ణేతలు కితాబిచ్చారు.
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 నుండి కార్తీక్ అనివార్య కారణాల వల్ల తప్పుకుంటున్నాడని, ఆ స్థానంలోకి బాబా సెహగల్ వచ్చారని శుక్రవారం ఎపిసోడ్ ప్రారంభంలో ప్రకటించారు. అయితే అదంతా ఏప్రిల్ ఫూల్ అని, నెక్ట్స్ ఎపిసోడ్ నుండి కార్తీక్ వచ్చి చేరతాడని శనివారం ఎపిసోడ్ ఎండింగ్ లో తెలిపారు. బాబా సెహగల్ ఈ రెండు ఎపిసోడ్స్ లో తన ఎలక్ట్రిఫైయింగ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇప్పటి వరకూ సైనికుడి దుస్తుల్లోనే వేదిక మీదకు వచ్చి పాటలు పాడిన చక్రపాణి ఈసారి మేకోవర్ తో అలరించాడు. అంతేకాదు… బాబా సెహగల్ ‘మిస్టర్ పర్ ఫక్ట్’ మూవీ కోసం పాడిన పాటను ఆలపించాడు. చక్రపాణి ఫెర్ఫార్మెన్స్ కు ముగ్థుడైనా బాబా సెహగల్ తానూ వేదిక మీదకు వచ్చి చక్రపాణితో పాటు పాట పాడి, స్టెప్పులేశాడు. న్యూజెర్సీ నుండి వచ్చిన శ్రుతి ‘కొంచెం నీరు… కొంచెం నిప్పు’ పాట పాడి బొమ్మ బ్లాక్ బస్టర్ పెర్ఫార్మెన్స్ అనిపించుకుంది. గత వారం ఎలిమినేషన్ ను చివరి క్షణంలో తప్పించుకున్న ఆదిత్యకు ఈ సారి కూడా అదే పరిస్థితి ఎదురైంది. ఆడియెన్స్ ఓట్లతో ఆదిత్య సేఫ్ అయ్యాడు. పోటీ నుండి మానస తప్పుకోవాల్సి వచ్చింది. ఇక మిగిలిన 10 మంది కంటెస్టెంట్స్ మరో థీమ్ తో వచ్చే వారం ఆడియెన్స్ ను ఆకట్టుకోవడానికి సిద్ధపడుతున్నారు.