అక్కినేని హీరో సుమంత్ ‘మళ్లీ రావా’ చిత్రం తర్వాత అంతటి విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ సినిమా తరవాత పలు సినిమాల్లో నటించినా సుమంత్ కి విజయం మాత్రం దక్కలేదు. దీంతో మరోసారి ఫ్యామిలీ ఎంటర్టైనర్ నే నమ్ముకున్నాడు. కొత్త కాన్సెప్ట్ తో ‘మళ్లీ మొదలయ్యింది’ అనే చిత్రంతో ఈసారి సందడి చేయనున్నాడు. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నైనా గంగూలీ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.
విడాకుల తర్వాత ఒక యువకుడి జీవితంలో జరిగే అవమానాలు, అపార్ధాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. కొన్ని విభేదాల వలన భార్యతో విడిపోయిన విక్రమ్ .. భార్య తరుపున వాదించే లాయర్ ప్రేమలో పడతాడు. ప్రేమ, పెళ్లితో మళ్లీ కథ మొదలయ్యింది. పెళ్లి.. ప్రేమ.. విభేదాలు.. విడాకులు.. మొత్తంగా చూసుకుంటే ఇదే కథగా తెలుస్తోంది. ఇక సుమంత్ ఎంతో పరిణీతి కలిగిన యువకుడిగా కనిపించాడు. పెళ్ళాం వదిలేసిన భర్త అని అందరు అంటున్నా, మరో పెళ్లికి బంధువులు ఏర్పాట్లు చేస్తున్నా ఏమి చేయలేని కన్ఫ్యూజ్డ్ పర్సన్ గా సుమంత్ కనిపించాడు. ఇక చివర్లో మంజుల ఘట్టమనేని స్పెషల్ ఎట్రాక్షన్ గా కనిపించి మెప్పించింది. ట్రైలర్ చూస్తుంటే న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సినిమా తెరకెక్కినట్లు అర్ధమవుతుంది. అనూప్ రూబెన్స్ సంగీతం, కృష్ణ చైతన్య పాటలు మెప్పించాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. మరి ఈ చిత్రంతో సుమంత్ మరో హిట్ ని అందుకుంటాడేమో చూడాలి..