మలయాళ స్టార్ సురేష్ గోపి ఆదివారం మేడే సందర్భంగా మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (అమ్మా) సమావేశానికి హాజరయ్యారు. సంస్థతో తనకు రెండు దశాబ్దాలుగా ఉన్న ఎడబాటుకు ముగింపు పలికారు. నటుడు, రాజకీయవేత్త అయిన సురేశ్ గోపికి అసోసియేషన్ నుంచి ఘన స్వాగతం లభించింది. అమ్మా ఏర్పాటు చేసిన వైద్య శిబిరం ఉనర్వుకు సురేశ్ గోపి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యదర్శి ఎడవెల బాబు సహా అమ్మా ఆఫీస్ బేరర్స్, నటుడు బాబురాజ్ సురేష్ గోపికి శాలువా కప్పి స్వాగతం పలికారు. 1997 చివరలో గల్ఫ్ ప్రోగ్రామ్ సందర్భంగా అమ్మా సంస్థతో ఏర్పడిన వివాదం కారణంగా సురేష్ గోపి ‘అమ్మా’కు దూరంగా ఉన్నారు. అరేబియన్ డ్రీమ్స్ పేరుతో అప్పట్లో అమ్మా చేపట్టిన వెల్ ఫేర్ ప్రోగ్రామ్ కు సురేశ్ గోపి 5 లక్షలు విరాళంగా ఇస్తానని మాట నిలుపుకోక పోవడం అప్పట్లో వివాదానికి దారితీసింది. దాంతో సురేశ్ గోపి 2లక్షలు పెనాల్టీ చెల్లించాలని అసోసియేషన్ నిర్ణయించటంతో తను అమ్మాకు దూరంగా ఉన్నారు. ఆ వివాదం పరిష్కారం అయిందో లేదో కానీ ఇప్పుడు మాత్రం సురేశ్ గోపి మళ్ళీ అమ్మాతో కలసిపోయారు.