ఇండియాలో సూపర్ హీరో సినిమాలతో తమని తాము నిరూపించుకోవడానికి పలువురు ప్రయత్నించారు. వారిలో రాకేశ్ రోషన్ తన క్రిష్ సీరీస్ ద్వారా సక్సెస్ అయ్యాడు. అయితే మన ఇండియన్ సూపర్ హీరో సినిమాలు ఏవీ ‘స్పైడర్‌మ్యాన్, బ్యాట్‌మాన్’ లా ప్రేక్షకులను ఉత్తేజపరచలేదు. అయితే తాజాగా విడుదలైన మలయాళ చిత్రం ‘మిన్నల్ మురళి’ గత వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘నెట్ ఫ్లిక్స్’లో విడుదలై అందరినీ ఆశ్చర్యపరుస్తూ చార్ట్‌లలో నెంబర్ వన్ ప్లేస్ సాధించింది. నిజానికి సూపర్‌హీరో చిత్రాలలో రెండు విషయాలు కామన్ గా ఉంటాయి, అవి హీరో సూపర్ శక్తి కలిగి ఉండటం, రెండు అతని లక్ష్యం ప్రపంచాన్ని రక్షించడం.
ఇక ఇండియన్ సూపర్ హీరో చిత్రం ‘క్రిష్’ లో తక్కువ నాణ్యతతో కూడిన విజువల్ ఎఫెక్ట్స్ వల్ల కొంత మేరకే ఆకట్టుకోగలుగుతాయి. అయితే ‘మిన్నల్ మురళి’ అలా కాదు. ఈ సూపర్ హీరో సెటప్ కేవలం ఒక చిన్న గ్రామానికి మాత్రమే పరిమితం చేయబడింది. దీని వల్ల దర్శకుడు బాసిల్ జోసెఫ్ విజువల్ ఎఫెక్ట్స్ పై అంతగా దృష్టి పెట్టాల్సిన అవసరం కలగలేదు. ఇందులో ఇద్దరు వ్యక్తులు సూపర్ పవర్‌ను పొందడం, వారిలో ఒకరు మంచి వైపు నిలవడం, మరొకరు చెడును ఆశ్రయించటంతో ఆసక్తికరంగా మారింది. ఈ అంశం ప్రేక్షకులను థ్రిల్ చేస్తోంది. ఈ సినిమాలో టైటిల్ రోల్ ని టోవినో థామస్ పోషించాడు. గతంలో తమిళంలో జీవా ‘ముగమూడి, విక్రమ్ మల్లన్న’ కూడా ఇలాంటి కథాంశంతోనే తెరకెక్కాయి. కానీ వాటిని సమర్థవంతంగా తెరకెక్కించటంలో దర్శకులు తడబడ్డారు. కానీ ‘మిన్నల్ మురళి’ అలా కాదు. అన్ని వర్గాల వారినీ అలరిస్తోంది. అందుకే నెట్ ఫ్లిక్స్ ఛార్ట్ లలో నెంబర్ వన్ గా నిలిచింది