Boyfriend for Hire: ‘బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్’ అనే టైటిల్ ను బట్టి దీనిని బోల్డ్ ఫిల్మ్ అని భావించే ఆస్కరం ఉందని కానీ ఇది చాలా క్లీన్ ఫిల్మ్ అని, సెన్సార్ వాళ్ళు కూడా యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారని ఈ చిత్ర కథానాయిక మాళవిక సతీశన్ చెబుతోంది. ”చూసి చూడంగానే’ చిత్రంలో ప్రాధాన్యమున్న పాత్రను పోషించిన మాళవిక ‘రోమ్ కామ్ మూవీ ‘బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ (బి.ఎఫ్.హెచ్.)లో హీరోయిన్ గా నటించింది. అంతేకాదు.. శివ నాగేశ్వరరావు రూపొందిస్తున్న ‘దోచేవారెవరురా’లోనూ, సూపర్ గుడ్ సంస్థ నిర్మిస్తున్న సినిమాలోనూ కూడా హీరోయిన్ గా నటిస్తోంది.
తాజా చిత్రం ‘బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్’ గురించి మాళవిక మాట్లాడుతూ, ”ఇందులో దివ్య అనే పాత్రలో కనిపిస్తా. నా రియల్ లైఫ్ కి దగ్గరగా వుండే పాత్ర ఇది. చాలా బబ్లీగా వుంటుంది. బేసిగ్గా సినిమాల్లో అమ్మాయి వెనుక అబ్బాయి తిరుగుతాడు. కానీ ఇందులో అమ్మాయే అబ్బాయి వెనుక తిరుగుతుంది. కథలో మంచి ఎమోషనల్ జర్నీ వుంటుంది. చాలా డిఫరెంట్ గా కాన్సెప్ట్ తో దీనిని తీశారు. ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుందనే నమ్మకం వుంది. థియేటర్ ఎక్స్ పీరియన్స్ వున్న సినిమా ఇది. కోవిడ్ కారణంగా ఆలస్యమైనప్పటికీ ముందు అనుకున్నట్లే థియేటర్లోనే విడుదల చేస్తున్నారు” అని తెలిపింది. పాత్రల విషయంలో తనకు విష్ లిస్టు వుందని, డిఫెన్స్ ఆఫీసర్ గా చేయాలన్నది కోరిక అని, మంచి స్పోర్ట్ సినిమా, బయోపిక్ చేయాలని ఆశపడుతున్నట్టు మాళవిక సతీశన్ చెప్పింది. నాగశౌర్య, అఖిల్ తో పాటు అడివి శేష్ నటన అంటే ఇష్టమని చెప్పింది. విశ్వంత్ దుడ్డుంపూడి హీరోగా సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో వేణు మాధవ్ పెద్ది, కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఇదే నెల 14న విడుదల కాబోతోంది.