Shoot Shufflings for Mahesh Babu’s Guntur Kaaram: ఏ ముహూర్తాన మొదలు పెట్టారో తెలియదు కానీ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా షూటింగ్ అనేకసార్లు వాయిదా పడుతూ వస్తోంది. ముందుగా ఈ సినిమా స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సి రావడంతో షూట్ కాస్త వాయిదా పడింది. ఆ తర్వాత మహేష్ బాబు తల్లి, తండ్రి మరణించడంతో మరి కొన్నాళ్లు వాయిదా పడింది. ఇక మహేష్ బాబు ఇంకా దుఃఖం నుంచి బయటకు రాకపోవడంతో మళ్లీ మళ్లీ వాయిదా పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక తాజాగా ఈ నెలలో ప్రారంభం కావాల్సిన షెడ్యూల్ కూడా నిరవధికంగా వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి గుంటూరు కారం సినిమా తాజా షెడ్యూల్ జూన్ 12న మొదలు కావాల్సి ఉంది.
Megastar’s next: మెగాస్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. రీమేక్ టెన్షన్ లేనట్టే?
కానీ సినిమాలో ఉన్న ఇతర ఆర్టిస్టుల డేట్లు క్లాష్ రావడంతో దానిని 20వ తేదీకి మార్చారని అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే అప్పటికి కూడా ఈ సమస్య క్లియర్ అయ్యే అవకాశాలు లేకపోవడంతో ఏకంగా వచ్చే నెలకు షూటింగ్ వాయిదా వేసినట్లుగా చెబుతున్నారు. దర్శక నిర్మాతలు కావాలని చేయకపోయినా ఇలా సినిమాని పదే పదే వాయిదా వేస్తూ రావడం మహేష్ బాబు అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు. మరోపక్క ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశారు మేకర్స్. ఈ మధ్యనే ఒక గ్లింప్స్ రిలీజ్ చేసి కచ్చితంగా రిలీజ్ వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 13న చేస్తామని ప్రకటించారు. 12 ఏళ్ల గ్యాప్ తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ కలిసి చేస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గుంటూరు కారం సినిమాలో స్టార్ టెక్నీషియన్లు భాగమయ్యారు. సినిమాటోగ్రాఫర్ పిఎస్ వినోద్, స్టార్ మ్యూజిషియన్ థమన్, ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్, జాతీయ అవార్డు గ్రహీత ఎడిటర్ నవీన్ నూలి ఈ సినిమాకి పనిచేస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ మీద ఈ సినిమాని ఎస్ రాధాకృష్ణ, ఎస్ నాగ వంశీ నిర్మిస్తున్నారు.