ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలందరూ బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడెప్పుడు ఇద్దామా అని ఎదురుచూస్తున్నవారే. అయితే వీరందరిలో ఇప్పటివరకు బాలీవుడ్ వైఫు కన్నెత్తి చూడని హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అక్కడ నుంచి అవకాశాలు వెల్లువలా వస్తున్నా తనకు టాలీవుడ్ లోనే ఉండాలని ఉంది అని చెప్పిన మహేష్ ప్రస్తుతం ఒకపక్క హీరోగా , ఇంకోపక్క నిర్మాతగా విజయ పథంలో దూసుకెళ్తున్నారు. ఇక మహేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘మేజర్’ సినిమా ట్రైలర్ ను నిన్ననే విడుదల చేసిన విషయం విదితమే. ఇక ఈ వేదికపై మహేష్ బాలీవుడ్ ఎంట్రీ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
స్టార్ హీరోలందరూ బాలీవుడ్ వైపు మొగ్గు చూపుతున్నారు. మరి మీరెప్పుడు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారు అన్న ప్రశ్నకు మహేష్ సమాధానమిస్తూ “నాకు బాలీవుడ్ నుంచి చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ నన్ను వారు భరించలేరు.. నన్ను భరించలేని ఇండస్ట్రీకి వెళ్లి సినిమాలు తీయడం టైమ్ వేస్ట్.. తెలుగులో కూడా నాకు మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇక్కడ నాకంటూ ఒక విలువ,గౌరవం ఉన్నాయి. టాలీవుడ్ నాకు మంచి గుర్తింపు, గౌరవం, స్టార్ డమ్ ఇచ్చింది. ఇవి చాలు నాకు.. ఇవే నాకు సంతోషాన్నిస్తాయి. అందుకే, నా పరిశ్రమను విడిచి మరేదో ఇండస్ట్రీకి పని చేయాలనే ఆలోచన నాకు లేదు. మరిన్ని సినిమాలు చేసి మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకున్నాను. అది ఇప్పుడు నెరవేరుతుంది. ఇంతకంటే ఇంకేం కోరుకోవాలనుకోవడం లేదు” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.