సర్కారు వారి పాట సినిమా విడుదలైన తర్వాత సూపర్‌స్టార్ మహేష్ బాబు వెకేషన్‌కు వెళ్లాడు. ఈ సందర్భంగా ఫ్యామిలీతో కలిసి విదేశీ టూర్లో ఆనందంగా గడుపుతున్నాడు. గత కొన్ని రోజులుగా మహేష్ బాబు విదేశీ టూర్‌కు సంబంధించిన వీడియోలు, ఫోటోలను ఆయన అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. తాజాగా అమెరికా పర్యటనలో న్యూయార్క్ నగరంలో సాఫ్ట్వేర్ దిగ్గజం బిల్‌గేట్స్‌ను మహేష్ బాబు ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోను మహేష్ బాబు షేర్ చేస్తూ.. ‘బిల్‌గేట్స్ ప్రపంచంలోని గొప్ప దార్శనికులలో ఒకరు. అంతకంటే ఎక్కువగా వినయంతో ఉన్నారు. నిజంగా మీరు ఒక స్ఫూర్తి’ అని ట్వీట్ చేశాడు. దీంతో క్షణాల్లోనే మహేష్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.
Read Also: Dil Raju: స్టార్ ప్రొడ్యూసర్ ఇంటికి ‘వారసుడొచ్చాడు’
మహేష్‌బాబు త్వరలోనే విదేశీ టూర్ ముగించుకుని ఇండియాకు రానున్నాడు. ఇక్కడికి రాగానే త్రివిక్రమ్‌తో చేయబోయే సినిమా షెడ్యూళ్లతో బిజీ కానున్నాడు. కాగా ఇటీవల యూరప్ ట్రిప్‌లో మహేష్‌బాబు రోడ్డుపై నడిచి వెళ్తుండగా ఆయన తన సతీమణి నమ్రత, కొడుకు గౌతమ్, కూతురు సితారతో కలిసి సెల్ఫీ దిగి నెట్టింట్లో పోస్ట్ చేయగా అది ఫుల్ వైరల్ అయ్యింది. ఈ సందర్భంగా రోడ్డుపై కుటుంబంతో నడిచి వెళ్తున్న వీడియోను మహేష్ షేర్ చేస్తూ.. ‘షికారును మరేదీ అధిగమించలేదు..ఈ దృశ్యాన్ని క్యాప్చర్ చేసిన క్రెడిట్ మళ్లీ నా స్నేహితుడైన జావియర్ అగస్టీనాకు వెళ్తుంది’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియోలో మహేష్‌తో పాటు నమ్రత కూడా వాకింగ్ చేస్తూ సందడి చేసింది.