Mahanati Savitri Birth Anniversary: మహానటి సావిత్రి పేరు వినగానే ఆమె అభినయ పర్వంలోని పలు మహత్తర పాత్రలు మన మనోఫలకంపై కదలాడతాయి. తెలుగునాటనే కాదు తమిళ చిత్రాలలోనూ సావిత్రి తనదైన నటనతో మురిపించారు, మైమరిపించారు. నేడు మహానటుడుగా జేజేలు అందుకుంటున్న అమితాబ్ బచ్చన్ సైతం తనకు నచ్చిన నటీనటుల జాబితాలో సావిత్రి పేరును జోడించి, ఆమె కళ్ళతోనే అభినయించే తీరు తనను ఆకట్టుకుందని అన్నారు. సావిత్రి నటించిన అనేక చిత్రాలను చూసే అవకాశం అమితాబ్ కు తక్కువే. చూసినంతలోనే ఆ మహానటుణ్ణి సైతం ఆకట్టుకున్నారు మన మహానటి సావిత్రి. ఆమె నటించిన చిత్రాలలో మీకు నచ్చిన సినిమా ఏది అని ఎవరినైనా అడిగితే, “ఒక్కటని చెప్పలేము” అనే అంటారు.
తెలుగులో మహానటులు యన్టీఆర్, ఏయన్నార్ తో సావిత్రి అభినయించిన అనేక చిత్రాలు మన మదిలో తిష్ట వేసుకున్నాయి. పౌరాణికాల్లో “మాయాబజార్, శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం, నర్తనశాల, పాండవవనవాసము” వంటి మహత్తర చిత్రాలలో సావిత్రి నటించిన తీరు మనల్ని ఒక పట్టాన వదలిపెట్టదు. జానపదాల విషయానికి వస్తే “చంద్రహారం, బండరాముడు, కంచుకోట” లాంటి సినిమాల్లో ఆమె అభినయించిన వైనం మనల్ని కట్టిపడేస్తుంది. సాంఘికాల్లో “దేవదాసు, కన్యాశుల్కం, మిస్సమ్మ, దొంగరాముడు, తోడికోడళ్ళు, సుమంగళి, మంచిమనసులు, మూగమనసులు, అర్ధాంగి, కలసివుంటే కలదుసుఖం, ఆత్మబంధువు, రక్తసంబంధం, గుండమ్మకథ” ఇలా పలు చిత్రాలు పలకరిస్తూనే ఉంటాయి. అలాంటి మహానటికి ఇంత పేరు సంపాదించి పెట్టిన చిత్రాలేవీ నచ్చవట! సావిత్రి నటించిన చిత్రాలలో ఆమెకు నచ్చిన సినిమా ‘చివరకు మిగిలేది’ అని స్వయంగా ఆమెనే అనేక సార్లు చెప్పారు.
తాను నటించిన ఇతర చిత్రాలన్నీ ప్రేక్షకుల మనసులను రంజింప చేసి ఉండవచ్చును కానీ, ‘చివరకు మిగిలేది’ మాత్రం తనలోని నటికి ఓ సవాల్ విసిరిందనీ, దానిని ఎదుర్కొని పోషించిన పాత్ర కాబట్టి ఆ సినిమాయే తనకు నచ్చిన తన చిత్రమని సావిత్రి అనేవారు. అప్పట్లో మన తెలుగు సినిమా జనం చాలావరకు కథా చిత్రాలు తీయాలంటే బెంగాలీ సాహిత్యంపైనే ఆధారపడేవారు. అలాంటి సమయంలో అశుతోష్ ముఖర్జీ రచన ‘నర్స్ మిత్ర’ ఆధారంగా బెంగాలీలో తెరకెక్కిన ‘దీప్ జెలే జై’ చిత్రం దర్శకుడు రామినీడును ఆకట్టుకుంది. ఆయనతో పాటు నిర్మాత పురుషోత్తమ రెడ్డిని కూడా అందులో ప్రధాన పాత్ర పోషించిన సుచిత్రాసేన్ ఆకర్షించింది. మరికొన్ని బెంగాలీ చిత్రాలు చూసినా, వారిద్దరి మనసులో ‘దీప్ జెలే జై’ తిష్ట వేసుకుంది. దాంతో లాభం వస్తే రానీ పోతే పోనీ ‘దీప్ జెలే జై’ను తెలుగులో తీయాలని తీర్మానించుకున్నారు. సుచిత్రాసేన్ ను మరిపించేలా సావిత్రి ఒక్కరే నటించగలరని వారిద్దరి నమ్మకం. అదే మాట సావిత్రితోనూ చెప్పారు. దాంతో ఆమె ఆ కథలోని నర్సు పద్మ పాత్రను ఓ సవాల్ గానే భావించారు. అలా రూపొందిన చిత్రమే ‘చివరకు మిగిలేది’.
‘చివరకు మిగిలేది’లో నర్సు పద్మ పాత్రలో సావిత్రి నటించలేదు, జీవించారనే చెప్పాలి. మానసిక రోగులను నయం చేయడానికి మందులకంటే వారి మనసులను ఆకట్టుకొనే ప్రవర్తనే అసలైన వైద్యం అనే అంశాన్ని ఈ కథలో పొందు పరిచారు. మానసిక రోగులకు వైద్యం అందించే ఆసుపత్రిలో పనిచేసే నర్సు పద్మ తమ వద్దకు వచ్చిన రోగులను తన అభిమానం, ఆత్మీయత, ప్రేమతో నయం చేస్తూ ఉంటుంది. అలా భగ్నప్రేమికుడైన భాస్కర్ ను తన ప్రేమతో బాగు చేస్తుంది. తరువాత అదే తీరున ప్రేమలో విఫలమైన ప్రకాశంను కూడా తనదైన రీతిలో నయమయ్యేలా చేస్తుంది. ప్రకాశం పద్మను నిజంగానే ప్రేమిస్తాడు. కానీ, భాస్కర్ ను మనసులో నింపుకున్న పద్మకు అది అసాధ్యంగా పరిణమిస్తుంది. చివరకు ఆమెనే మానసిక రోగిగా మారుతుంది. భగ్నప్రేమికులను నయం చేయడంలో కీలక పాత్ర పోషించిన నర్సు పద్మ, మానసిక రోగి కావడంతో ఆమెను అందుకు నియమించిన డాక్టర్ పశ్చాత్తాప పడతాడు. పద్మలో తాను ఓ నర్సును మాత్రమే చూశానని, ఆమెలోని స్త్రీ మూర్తిని గమనించలేకపోయానని వాపోతాడు. కానీ, అప్పటికే ఆలస్యమై పోతుంది. ఇదీ ‘చివరకు మిగిలేది’లోని కథ. ఈ కథలోని పద్మ పాత్ర సావిత్రిని అంతలా ఆకట్టుకోవడానికి కారణం, ఆమెలోనూ సున్నితమైన మనసు దాగుండడమే అని అభిమానుల అభిప్రాయం. ఏది ఏమైనా పద్మ పాత్రలో జీవించిన సావిత్రి అభినయం ‘చివరకు మిగిలేది’ని జనరంజకం చేయలేక పోయింది. కానీ, తన చిత్రాలలో తాను మెచ్చిన చిత్రంగా ‘చివరకు మిగిలేది’నే సదా స్మరించుకొనేవారు సావిత్రి. అందుకు దర్శకుడు జి.రామినీడు ప్రతిభ, నిర్మాత వి.పురుషోత్తమ రెడ్డి సాహసం కారణమనీ ఆమె గుర్తుచేసుకొనేవారు.