Prema Kavali: వారసులకు చిత్రసీమలో ఎంట్రీ సులువు అవుతుందే కానీ… వాళ్ళ కష్టాలు వాళ్ళకుంటాయి. ముఖ్యంగా తండ్రి నటుడైతే అతని నటనతో పోల్చుతారు. తాతలు కూడా నటులైతే ఇక చెప్పలేనన్ని కష్టాలు. రెండు జనరేషన్స్ కు సంబంధించిన వాళ్ళ విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. తాతయ్య పీజే శర్మ, తండ్రి సాయికుమార్ నట వారసత్వాన్ని అందిపుచ్చుకుని పన్నెండేళ్ళ క్రితం ‘ప్రేమ కావాలి’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు ఆది సాయకుమార్. విజయ భాస్కర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ తొలి చిత్రం ఘన విజయం సాధించింది. ఆ తర్వాత బి. జయ దర్శకత్వం వహించిన ‘లవ్ లీ’ కూడా ఆది సాయికుమార్ కు చక్కని పేరు తెచ్చిపెట్టింది. కానీ ఆ తర్వాత ఆది చేసిన సినిమాలు ఘన విజయాన్ని అందుకోలేదు. బట్… పరాజయాలకు భయపడకుండా… భిన్నమైన కథాంశాలను ఎంపిక చేసుకుని ముందుగా సాగాడు ఆది సాయికుమార్. అదే అతను తన కెరీర్ కు సంబంధించిన తీసుకున్న వైజ్ డిసిషన్.
ఆది సాయికుమార్ కు “సుకుమారుడు, శమంతకమణి, ఆపరేషన్ గోల్డ్ ఫిష్, బుర్రకథ, శశి” వంటివి కమర్షియల్ సక్సెస్ ఇవ్వకపోయినా, అతనిలోని నటుడిని ఆవిష్కరించాయి. వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా, సద్వినియోగం చేసుకోవడం వల్లే గత యేడాది ఏకంగా అతను నటించిన ఐదు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ యేడాది వెబ్ సీరిస్ తో ఆది సాయికుమార్ శ్రీకారం చుట్టాడు. గత శుక్రవారం నుండి జీ 5లో స్ట్రీమింగ్ అవుతున్న ‘పులి మేక’ వెబ్ సీరిస్ లో ఫోరెన్సిక్ టీమ్ హెడ్ ప్రభాకర శర్మ పాత్రను పోషించి ప్రశంసలు అందుకుంటున్నాడు ఆది సాయికుమార్. అలానే అతను నటించిన ‘సి.ఎస్.ఐ. సనాతన్’ మూవీ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ సినిమా మార్చి 10న జనం ముందుకు రావాలి. అంతే కాకుండా మరో రెండు మూడు ప్రాజెక్ట్స్ సెట్స్ పై వివిధ దశల్లో ఉన్నాయి. సాయికుమార్ తనయుడే అయినా… తండ్రి ప్రభావం తన మీద పడకుండా తనకంటూ ఓ శైలిని క్రియేట్ చేసుకుంటున్నాడు ఆది. నటుడిగా పుష్కర కాలం పూర్తి చేసుకున్న లవ్లీ స్టార్ ఆది సాయికుమార్ రాబోయే రోజుల్లో ఇంకెన్ని విజయాలను అందుకుంటాడో చూడాలి.