నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల రూపొందించిన ‘లవ్ స్టోరి’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు లభిస్తున్న ఆదరణ పట్ల యూనిట్ సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. ఏషియన్ సినిమాస్ కార్యాలయంలో జరిగిన సక్సెస్ మీట్ లో శేఖర్ కమ్ముల, నాగచైతన్య, సాయి పల్లవి, నిర్మాతలు నారాయణదాస్ నారంగ్, సునీల్ నారంగ్, పి.రామ్మోహన్ రావు పాల్గొన్నారు. కేక్ కట్ చేసిన యూనిట్ ‘లవ్ స్టోరి’ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ ‘ఎంతో కష్టపడి ఈ సినిమాను మీ ముందుకు తీసుకొచ్చాం. ప్రేక్షకులు గొప్ప విజయాన్ని అందించారు. మాటలు రావడం లేదు. కులం పేరుతో ఇబ్బందులు పడే హీరోకు, చిన్నప్పటి నుంచి వివక్షకు, బాధలకు గురైన అమ్మాయికి మధ్య జరిగిన కథ ఇది. నిర్భయ ఘటన తర్వాత సొసైటీకి మంచిని చెప్పే సినిమా చేయాలని అనుకున్నాను. ఆ తర్వాత స్కూల్స్, కాలేజీలకు వెళ్లి ధీర నువ్వే ధీర అనే అవేర్ నెస్ ప్రోగ్రాం చేశాం. అక్కడే ఈ సినిమాకు కథ దొరికింది. నా మీద నమ్మకంతో థియేటర్లకు వచ్చిన ఆడియెన్స్ కు థాంక్స్’ అని చెప్పారు.
నాగ చైతన్య మాట్లాడుతూ ‘ఈ టైమ్ లో ఆడియెన్స్ రారేమో అని భయపడ్డాం. థియేటర్స్ లో ప్రేక్షకులను చూస్తుంటే ఆనందంగా ఉంది. ఇందులో అడ్రస్ చేసిన ఇష్యూస్ కు ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. ఇది థియేటర్ లలోనే చూడాల్సిన సినిమా’ అన్నారు. సాయి పల్లవి మాట్లాడుతూ ‘ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఇండస్ట్రీలో అందరూ కోరుకున్నారు. స్టార్స్ ట్వీట్స్ చేశారు. ఇతర ఇండస్ట్రీ స్టార్స్ సపోర్ట్ చేశారు. వాళ్లందరికీ కృతజ్ఞతలు. మన చుట్టూ సమాజంలో ఇళ్ళల్లో జరిగే సమస్యలు చూపించాము. సొసైటీకి ఉపయోగపడే ఈ పాయింట్స్ ను టచ్ చేసిన శేఖర్ కమ్ముల గారిని అభినందించాలి’ అని తెలిపారు.
నిర్మాత పి.రామ్మోహన్ రావు మాట్లాడుతూ ‘సెకండ్ వేవ్ తర్వాత థియేటర్స్ లో భారీగా రిలీజైన సినిమా మాది. దీనికి సపోర్ట్ చేసిన ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ కు థాంక్స్. శేఖర్ కమ్ముల, నాగచైతన్య, సాయి పల్లవి తో మాకు మంచి బాండింగ్ ఉంది. ఈ అసోసియేషన్ ఇకపైనా కొనసాగుతుంది’ అని అన్నారు. ఇదే కాంబినేషన్ లో దర్శకుడు శేఖర్ కమ్ముల నెక్ట్ ఇయర్ మరో సినిమా చేయాలని కోరుకుంటున్నా అని సునీల్ నారంగ్ కోరారు.