(డిసెంబర్ 6న సావిత్రి జయంతి)
మహానటి సావిత్రి హిట్ పెయిర్ ఎవరు అన్న సంశయం అప్పట్లో చాలామందికి కలిగేది. తమిళనాట ఆమె భర్త జెమినీగణేశన్ ఆమె హిట్ పెయిర్ అని తేల్చేశారు. తెలుగునాట ఆమెకు సరైన జోడీ అంటే యన్టీఆర్ అని కొందరు, కాదు ఏయన్నార్ అని మరికొందరు అభిప్రాయపడ్డారు. నిజానికి ఆమె నటజీవితంలో జెమినీ గణేశన్, ఏయన్నార్ కంటే యన్టీఆర్ తోనే అనుబంధం ఎక్కువగా ఉందని చెప్పవచ్చు.
అసలైన హిట్ పెయిర్
సావిత్రి తొలిసారి తెరపై కనిపించిన చిత్రం ‘సంసారం’ (1950). అందులో సావిత్రికి ఏకంగా ఏయన్నార్ సరసన నాయికగా నటించే చాన్స్ దక్కింది. కానీ, ఆమె కెమెరా ముందు తగని సిగ్గు ప్రదర్శించడంతో ఆ అవకాశం అలా చేజారింది. అందులోనే ఓ పాటలో హీరోయిన్ ఫ్రెండ్స్ లో ఒకరిగా కొన్ని క్షణాల పాటు తెరపై కనిపించారామె. ఈ చిత్రంలో ప్రధాన నాయకుడు యన్టీఆర్. ఇక యన్టీఆర్ ను జానపద కథానాయకునిగా నిలిపిన ‘పాతాళభైరవి’ (1951)లో నే రానంటే రానే రాను..
అంటూ సాగే ఓ బిట్ సాంగ్ లో సావిత్రి నర్తించారు. ఆ సినిమా అనూహ్య విజయం సాధించి, విజయా సంస్థను నిలిపింది. ఈ సినిమా తరువాత యన్టీఆర్ తో విజయా సంస్థ నిర్మించిన సాంఘిక చిత్రం ‘పెళ్ళిచేసిచూడు’ (1952) లో జోగారావుకు జోడీగా నటించారు సావిత్రి. అందులో కొన్ని సన్నివేశాల్లో సావిత్రి కనబరచిన అభినయం అందరినీ ఆకట్టుకుంది. ఇక సావిత్రి కెరీర్ లో తొలిసారి ప్రధాన నాయికగా నటించిన చిత్రం ‘పల్లెటూరు’ (1952). ఇందులో యన్టీఆర్ ఆమెకు జోడీగా నటించారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆ పై “ప్రియురాలు, శాంతి” వంటి సినిమాల్లో నటించిన సావిత్రికి ‘దేవదాసు’ (1953)లోని పార్వతి పాత్ర మంచి పేరు సంపాదించి పెట్టింది. అసలు ‘దేవదాసు’లో ఆమెకు పార్వతి పాత్ర దక్కడానికి ‘పెళ్ళిచేసిచూడు’లో ఆమె పోషించిన పాత్రనే కారణమని అందరికీ తెలుసు.
కమలాకర కామేశ్వరరావును దర్శకునిగా పరిచయంచేస్తూ విజయా సంస్థ నిర్మించిన ‘చంద్రహారం’లో యన్టీఆర్ కథానాయకుడు. అందులో హీరోపై మనసు పడి, అతనిని తన సొంతం చేసుకోవాలని, నాయికకు పలుకష్టాలు కల్పించే చంచలగా నటించారు సావిత్రి. ఆమె కెరీర్ లో తొలిసారి యాంటీ రోల్ ధరించిన చిత్రమది. యన్టీఆర్, ఏయన్నార్ హీరోలుగా రూపొందిన ‘పరివర్తన’ (1954)లోనూ ఆమె యన్టీఆర్ సరసన నటించారు. ఇక 1955లో విడుదలైన ‘మిస్సమ్మ’లో యన్టీఆర్ కు నాయికగా నటించి, స్టార్ డమ్ నూ సొంతం చేసుకున్నారు. అలా యన్టీఆర్ చిత్రాలతోనే సావిత్రి ఒక్కో మెట్టూ ఎక్కుతూ, చివరకు అగ్ర కథానాయిక స్థాయికి చేరుకున్నారు. ఇప్పుడు చెప్పండి సావిత్రికి అసలైన హిట్ పెయిర్ ఎవరో?
పాత్రలే కనిపించేవి…
యన్టీఆర్, సావిత్రి ఇద్దరూ అభినయంలో సరైనజోడు అనీ ప్రతీతి. ముఖ్యంగా వారి భారీ విగ్రహాలు కూడా జంటగా నటిస్తే చూడముచ్చటగా ఉంటాయని సమకాలీన నటీనటులే అనేవారు. అయితే యన్టీఆర్, సావిత్రి నటిస్తే ఆ పాత్రలే కనిపిస్తాయి కానీ, వారిద్దరి జోడీని అభిమానించేవారు సైతం ఆ పాత్రల వావివరుసలు అంతగా పట్టించుకొనేవారు కారు. అనేక విజయవంతమైన చిత్రాలలో నాయకానాయికలుగా నటించిన యన్టీఆర్, సావిత్రి కొన్ని చిత్రాలలో అన్న-చెల్లెలుగా, అక్క-తమ్ముడుగా, వదిన -మరిదిగా నటించినా జనం ఆ సినిమాలకూ అఖండ విజయం అందించారు. 1960లలో ఓ వైపు యన్టీఆర్ కు , మరోవైపు ఏయన్నార్ కు విజయనాయికగా సాగుతున్నారు సావిత్రి. ఆ సమయంలో ‘రక్తసంబంధం’ (1962)లో అన్నాచెల్లెళ్ళుగా నటించారు రామారావు, సావిత్రి. ఆ చిత్రానికి ముందు వచ్చిన ‘గుండమ్మకథ’లో వారిద్దరూ భార్యాభర్తలుగా అభినయించి అలరించారు. ఇక తరువాత వచ్చిన ‘ఆత్మబంధువు’లోనూ యన్టీఆర్ నాయికగా సావిత్రి కనిపించారు. ఈ మూడు చిత్రాలూ రజతోత్సవం జరుపుకోవడం విశేషం. అంటే యన్టీఆర్, సావిత్రి తెరపై తమ పాత్రలుగా కనిపించారే తప్ప, హిట్ పెయిర్ అన్న చట్రంలో ఇరుక్కుపోలేదు.
ఇక యన్టీఆర్ సొంత చిత్రాలు ‘ఉమ్మడి కుటుంబం, కోడలు దిద్దిన కాపురం’ చిత్రాల్లో ఆయనకు వదినగా నటించి అలరించారు సావిత్రి. యన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన ‘వరకట్నం’ (1969)లో ఆయనకు అక్క వరుస పాత్రలో మెప్పించారామె. అదే యేడాది యన్టీఆర్ ‘విచిత్ర కుటుంబం’లో ఆయన భార్యగానే నటించి ఆకట్టుకున్నారామె. 1965లో కేవలం వారం గ్యాప్ లో యన్టీఆర్, సావిత్రి జంటగా నటించిన ‘నాదీ ఆడజన్మే’, ‘పాండవవనవాసము’ విడుదలయ్యాయి. రెండూ సిల్వర్ జూబ్లీ హిట్స్ కావడం గమనార్హం!
ఆ తరువాత కూడా…
ఇక 1965 సంవత్సరం దాటిన తరువాత నుంచీ సావిత్రి బాగా బరువు పెరిగారు. దాంతో ఆమెతో అంతకు ముందు పలు చిత్రాలలో నటించి, విజయం సాధించిన నాయకులు సైతం జంటగా నటించడానికి అంతగా ఆసక్తి చూపించేవారు కారు. ఆ సమయంలోనూ యన్టీఆర్ తో అనేక చిత్రాలలో నాయికగా నటించారు. ఇక సావిత్రి దర్శకురాలిగా రూపొం…