పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ఆమధ్య స్నేహ బంధం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. పవన్ ఆత్మగా త్రివిక్రమ్ ని చెప్తూ ఉంటారు పవన్ ఫ్యాన్స్. జల్సా చిత్రంతో స్టార్ట్ అయినా వీరి స్నేహబంధం ఇప్పటికి కొనసాగుతోంది. ఇక కొన్ని సందర్భాల్లో త్రివిక్రమ్ మాట తప్ప వేరొకరి మాట వినడు పవన్ అని అందరికి తెలిసిందే. పవన్ రీ ఎంట్రీ విషయంలో త్రివిక్రమ్ కీలక బాధ్యత వహించాడు. రీ ఎంట్రీ.. పింక్ రీమేక్ చేస్తే బావుంటుందని చెప్పింది త్రివిక్రమే అని అందరికి తెల్సిందే. ఇక భీమ్లా నాయక్ సినిమా కోసం త్రివిక్రమ్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. నిజం చెప్పాలంటే భీమ్లా హిట్ లో త్రివిక్రమ్ డైలాగ్స్ పవర్ సగం ఉంది అంటే అతిశయక్తి కాదు. అలా ఉంటుంది వారి స్నేహం. పవన్ కోసం ఏది చేయమన్న చేసే త్రివిక్రమ్ మొదటిసారి పవన్ మాట కాదన్నాడని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం పవన్ వరుస సినిమాలతో బిజీ గా ఉన్న సంగతి తెల్సిందే.
ఇప్పటికే కమిట్ అయిన సినిమాలను ఫినిష్ చేస్తున్న పవన్ .. తమిళ చిత్రం ‘వినోదాయ సితం’ చిత్రాన్ని కూడా రీమేక్ చేయాలని చూస్తున్న విషయం విదితమే. డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వంలోనే తెరకెక్కనున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ ని డైలాగ్స్ రాయమని అడిగాడట పవన్.. అయితే ఇందుకు మాటల మాంత్రికుడు నో అని చెప్పాడట. ఆయనకు పవన్ అప్పగించిన బాధ్యతల్ని మరో రచయితకు అప్పగించాలనే ఆలోచనలో త్రివిక్రమ్ వున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే త్రివిక్రమ్ మహేష్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సమయంలో పవన్ రీమేక్ కోసం వర్క్ చేసేంత సమయం తాను లేదని, తన పనిని మరో రచయిత సాయి మాధవ్ బుర్రాకు అప్పగించాలని చూస్తున్నారట. ఏదిఏమైనా పవన్ సాయం అడిగితే త్రివిక్రమ్ కాదనడం ఇదే మొదటిసారి.. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలి.