ప్రిన్స్ మహేశ్ బాబు తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ సంక్రాంతి బరిలో దిగడానికి సర్వసన్నాహాలు జరుపుకుంటోంది. కీర్తి సురేశ్ నాయికగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫ్రెష్ కాంబో మూవీ మీద భారీ అంచనాలే ఉన్నాయి. సరికొత్త ప్రదేశాలలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాకు ఎస్. తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. గతంలో మహేశ్ బాబు ‘దూకుడు, బిజినెస్ మేన్, ఆగడు’ చిత్రాలకు మ్యూజిక్ ఇచ్చిన తమన్ దాదాపు ఆరేళ్ల గ్యాప్ తర్వాత ప్రిన్స్ మూవీకి మళ్ళీ సంగీతం అందిస్తున్నాడు. విశేషం ఏమంటే… శుక్రవారంతో ‘సర్కారు వారి పాట’ మూవీ మ్యూజిక్ కంపోజిషన్స్ పూర్తయినట్టు తమన్ తెలిపాడు.
Read Also : వారం రోజుల్లో ‘ఎలిజిబుల్ బ్యాచిలర్’కు 40 కోట్లు!
మహేశ్ బాబుతో దిగిన ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేస్తూ ఈ సంగతి చెప్పాడు. ఎస్. తమన్ కు సంబంధించి మరో విశేషం కూడా ఉంది. 2022 సంక్రాంతి బరిలో తమన్ తన సినిమాతో తానే పోటీ పడబోతున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న రాబోతున్న పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ మూవీకి కూడా తమనే స్వరకర్త. అలానే ‘సర్కారు వారి పాట’ ఆ మర్నాడే 13న జనం ముందుకు రాబోతోంది. మరి ఈ రెండు సినిమాలనూ మ్యూజికల్ హిట్స్ చేసి, అదే విధంగా తన సంగీతంతో విజయపథంలోకి తమన్ తీసుకెళ్తాడేమో చూడాలి.
