మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతున్న విషయం విదితమే. గతేడాది సెప్టెంబర్ లో రోడ్డు ప్రమాదానికి గురై కోలుకున్న తర్వాత తేజ్ ఇటీవలే సినిమా సెట్స్ లో అడుపెట్టాడు. ప్రస్తుతం తేజ్.. ‘భమ్ బోలేనాథ్’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో #SDT15 చిత్రాన్ని చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై సుకుమార్ రైటింగ్స్ తో కలిసి బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుకుమార్ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందిస్తుండడం విశేషం. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకున్నటున్న ఈ సినిమా గురించిన ఒక వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే.. ఈ సినిమా అంతా బ్యాక్ మ్యాజిక్(చేతబడి) చుట్టూనే తిరుగుతుందట. ఒక గ్రామంలో చేతబడి కారణంగా వరుస మరణాలు సంభవించడం.. అదే గ్రామానికి అనుకోకుండా ముంబైలో ఇంజినీర్ గా పనిచేసే హీరో రావడం.. అక్కడ అతనిపై కూడా చేతబడి ప్రయోగం చేయడం, హీరో వాటిని తిప్పికొడుతూ అస్సలు ఆ గ్రామంలో ఎందుకు ఇలాంటివి చేస్తున్నారో తెలుసుకోవడమే సినిమా కథ అని అంటున్నారు.
సినిమా మొత్తం చేతబడి మీదనే ఉంటుందని సమాచారం. కాన్సెప్ట్ కొంచెం కొత్తగా ఉన్నా.. ఇలాంటి మూఢనమ్మకాల మీద సినిమాను అల్లడం కొంచెం రిస్క్ అని పలువురు అభిప్రాయపడుతున్నారు.అయితే సుకుమార్ కాబట్టి లాజిక్స్ ను కూడా బాగానే పెడతారని, ప్రేక్షకులు కన్విన్స్ అయ్యేలా చూస్తారని అంటున్నారు. ఇకపోతే తేజ్ ఈ కథపైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు. తేజ్ నటించిన చివరి చిత్రం రిపబ్లిక్ ఆశించిన ఫలితాన్ని అందుకోలేదన్న విషయం విదితమే.. దీంతో హిట్ కోసం మెగా మేనల్లుడు చేతబడినే నమ్ముకున్నాడు. మరి ఈ సినిమా అతని నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఉంటుందో.. లేదో చూడాలి.