Lata Mangeshkar Name For Ayodhya Chowrastha: భారతరత్న, గాన కోకిల లతామంగేష్కర్ 93వ జయంతిని పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం అయోధ్యలోని ఓ చౌరస్తాకు ఆమె పెట్టింది. సరయూ నది తీరంలో లతామంగేష్కర్ జ్ఞాపకార్థం నలభై అడుగుల వీణను ఏర్పాటు చేశారు. బుధవారం యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దానిని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. పద్నాలుగు టన్నుల బరువుతో నలభై అడుగుల పొడవు, పన్నెండు మీటర్ల ఎత్తుతో ఓ వీణను తయారు చేశారు. లతామంగేష్కర్ జీవితాన్ని ప్రతిబింబించేలా దాని చుట్టూ 92 కలువలను పొందు పరిచారు. సప్తస్వరాలకు ప్రతీకగా ఏడు స్తంభాలను ఏర్పాటు చేశారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో కిషన్ రెడ్డితో పాటు మహంత్ నృత్యగోపాల్ దాస్, జైవీర్ సింగ్, లతా మంగేష్కర్ మేనల్లుడు ఆదినాథ్ కృష్ణమంగేష్కర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, ”లతా దీదీ తన జీవితాన్ని కళలకు, సంగీతానికి అంకితం చేశారు. ఆమె భగవాన్ శ్రీరాముడిని స్తుతిస్తూ ఎన్నో భజన్స్ గానం చేశారు. అయోధ్య రామమందిరానికి దారి తీసే ఈ కూడలికి ‘లతా మంగేష్కర్ చౌక్’ అని నామకరణం చేయడం ఆనందంగా ఉంది. భారతదేశ కీర్తికి ప్రతీక అయినా లతా మంగేష్కర్ కు ఇది నిజమైన నివాళిగా భావిస్తున్నాను” అని అన్నారు. ‘లతా మంగేష్కర్ గొప్ప కళాకారిణి అని, ఆమె తన పాటలతో కోట్లాదిమందికి ఆత్మానందాన్ని కలిగించారని, ఆమె పాడిన ‘ఏ మేరే వతన్ కే లోగో’ గీతం కొన్ని తరాలలో జాతీయ భావనను ప్రేరేపించింద’ని జి. కిషన్ రెడ్డి తెలిపారు. ‘ఉదయాన్నే రాముడి ప్రార్థనతో లతా దీదీ తన దినచర్యను ప్రారంభించేదని, అయోధ్యలోని రామమందిరం వీధిలోని కూడలికి ఆమె పేరు పెట్టడం సంతోషాన్ని కలిగిస్తోందని మేనల్లుడు ఆదినాథ్ కృష్ణ మంగేష్కర్ చెప్పారు.