Lata Mangeshkar: ఈ శతాబ్దం లత గానానిదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lata Mangeshkar: కాశ్మీరం మొదలు కన్యాకుమారి దాకా విస్తరించిన భరతావనిని తన మధురగానంతో అలరించిన గానకోకిల లతా మంగేష్కర్. లతా మంగేష్కర్ పాట మనకు లభించిన ఓ వరం అనే చెప్పాలి. ఆ పాటతోనే పలు తరాలు అమృతపానం చేశాయి. ఆ పాటతోనే ఎందరో గాయనీమణులు తమ గళాలకు మెరుగులు దిద్దుకున్నారు. ఈ నాటికీ లత పాటతోనే ప్రతిదినం పరవశించి పోయేవారు ఎందరో ఉన్నారు.
లతా మంగేష్కర్ 1929 సెప్టెంబర్ 28న జన్మించారు. వారి కుటుంబం పాటల పొదరిల్లు. ఆమె తండ్రి దీనానాథ్ మంగేష్కర్ సుప్రసిద్ధ సంగీతకళాకారుడు. ఆయనకు ఐదు మంది పిల్లలు. వారిలో లతనే అందరికంటే పెద్ద. ఆమె తరువాత ఆశ, హృదయనాథ్, ఉష, మీనా ఉన్నారు. దీనానాథ్ మరణంతో ఇంటి భారం చిన్నారి లతపైనే పడింది. కొన్ని చిత్రాల్లో బాలనటిగానూ నటించారు లత. తరువాతి రోజుల్లో లత గాయనిగా మారి ప్రతి పాటలోనూ అమృతం కురిపించారు.
Also Read
ఆ నాటి మేటి సంగీత దర్శకుల్లో నౌషద్ అలీదే పైచేయి. లతలో అమృతం కురిపించే గానం దాగుందని నౌషద్ పసికట్టి ఆమెకు తగ్గ అవకాశాలు కల్పించారు. జనం మదిలో లతకు గానకోకిలగా పట్టం కట్టించారు. నౌషద్ స్వరకల్పనలో రూపొందిన ‘బైజూ బావ్రా’తోనే లతా మంగేష్కర్, మహ్మద్ రఫీ ఇద్దరూ స్టార్ సింగర్స్ అయిపోయారు. తరువాత సి.రామచంద్ర, ఎస్డీ బర్మన్, శంకర్ జైకిషన్ వంటి సంగీత దర్శకులు సైతం లత గానంలోని మధురాన్ని తమ బాణీలతో జోడీ కట్టించి, జనానికి మరపురాని మధురాన్ని పంచారు. ఇక లతతో మదన్ మోహన్ స్వరపరచిన పాటలు విశేషంగా అలరించాయి.
‘పరిచయ్’ చిత్రంలో గుల్జార్ రాసిన పాటకు ఆర్డీ బర్మన్ బాణీలు కూర్చగా 1972లో లత గానం చేసిన పాట ఆమెకు తొలి నేషనల్ అవార్డును సంపాదించి పెట్టింది. 1974లో ‘కోరా కాగజ్’ సినిమాలో కళ్యాణ్ జీ – ఆనంద్ జీ బాణీల్లో లతకు మరో నేషనల్ అవార్డు లభించింది. లతా మంగేష్కర్ ను మూడోసారి ఉత్తమ గాయనిగా జాతీయ స్థాయిలో నిలిపిన చిత్రం ‘లేకిన్’. ఈ చిత్రానికి ఆమె తమ్ముడు హృదయనాథ్ మంగేష్కర్ సంగీతం సమకూర్చడం విశేషం. నాలుగు సార్లు ఉత్తమ గాయనిగా ఫిలిమ్ ఫేర్ అవార్డులనూ లతా మంగేష్కర్ సొంతం చేసుకున్నారు. ఇక లత కీర్తి కిరీటంలో ప్రతిష్ఠాత్మక అవార్డులూ చోటు చేసుకున్నాయి. 1969లో పద్మభూషణ్, 1989లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 1999లో పద్మవిభూషణ్, 2001లో భారతరత్న లత దరి చేరాయి. ఇలా దేశం గర్వించదగ్గ అవార్డులన్నీ లత గానామృతం చేరి మరింత వెలుగులు విరజిమ్మాయి.
తెలుగువారితోనూ లతకు విడదీయరాని బంధం ఉంది. 1955లో తెరకెక్కిన ఏయన్నార్ ‘సంతానం’ చిత్రంలో తొలిసారి లత నోట తెలుగుపాట పలికింది. సుసర్ల దక్షిణామూర్తి స్వరకల్పనలో లత తన తొలి తెలుగు పాట “నిదుర పోరా తమ్ముడా…” గానం చేసి అలరించారు. ఈ పాట ఈ నాటికీ సంగీతాభిమానులను పరవశింప చేస్తూనే ఉంది. 1988లో నాగార్జున హీరోగా రూపొందిన ‘ఆఖరి పోరాటం’లో ఇళయరాజా స్వరకల్పలో “తెల్లచీరకు తకధిమి…” పాటను ఆలపించారు లత. ఇక 1991లో యన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ హిందీ వర్షన్ లో లతా మంగేష్కర్ గానం చేశారు. ఈ చిత్రానికి రవీంద్ర జైన్ సంగీతం సమకూర్చారు. అలా నందమూరి, అక్కినేని కుటుంబాలతో లతకు అనుబంధం ఉంది. మరో విశేషమేమంటే, ఆ ఇద్దరు మహానటుల పేరున నెలకొల్పిన జాతీయ అవార్డులనూ లతా మంగేష్కర్ సొంతం చేసుకున్నారు. 1999లో యన్టీఆర్ జాతీయ అవార్డు, 2009లో ఏయన్నార్ జాతీయ పురస్కారం లతా మంగేష్కర్ కు లభించాయి. ఈ యేడాది ఫిబ్రవరి 6న ఈ గాన కోకిల దివికేగింది. భౌతికంగా లత లేకున్నా, ఆమె గానం మాత్రం మహదానందం పంచుతూనే ఉంది. భావితరాలను సైతం పులకింప చేస్తూనే ఉంది.
తాజావార్తలు
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
OG 2 Update: పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ స్క్రిప్ట్ లాక్.. కానీ బిగ్ ట్విస్ట్!
-
Vu Glo Mini-LED TV: వీయూ గ్లో మినీ ఎల్ఈడీ టీవీ విడుదల.. 120Hz డిస్‌ప్లే, 50W సౌండ్‌తో కొత్త స్మార్ట్ టీవీ
-
Trent Boult విధ్వంసం.. యార్కర్‌తో బెయిర్‌స్టోకు షాక్.! ‘బై-బై’ సెలబ్రేషన్ వీడియో వైరల్.!
-
Telangana High Court: “సమాజంలో ఎవరికైనా బాధ్యత ఉందా”.. ఉచిత పథకాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్‌ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!