ఎందరో ప్రతిభావంతులు తమదైన బాణీ పలికిస్తూ తెలుగు సినిమా రంగంలోనూ రాణిస్తున్నారు. కోరుకున్న తీరాలను చేరుకొని ఆనందిస్తున్నారు. అలాంటి వారిలో దర్శకుడు కొరటాల శివ ఒకరు. ఆరంభంలో రచయితగా అలరించన కొరటాల శివ ‘మిర్చి’ సినిమాతో దర్శకుడయ్యారు. తొలి చిత్రంతోనే జయకేతనం ఎగరేశారు. మొన్న ‘ఆచార్య’తో మొదటి మల్టీస్టారర్ నూ జనం ముందు నిలిపారు.
కొరటాల శివ 1975 జూన్ 15న గుంటూరు జిల్లా పెదకాకానిలో జన్మించారు. కొరటాల శివలో ప్రతీ అంశాన్ని హేతువాద కోణంలో పరీక్షించే అలవాటు చిన్నతనంలోనే చోటు చేసుకుంది. సినిమాలంటే బాల్యం నుంచీ ఇష్టం ఉన్నా, చదువును అశ్రద్ధ చేయలేదు. మాతృభాషపై మమకారమూ ఉండేది. ప్రముఖ రచయిత పోసాని కృష్ణమురళికి శివ సమీపబంధువు. దాంతో మొదట్లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసిన శివ, తరువాత పోసాని వద్ద అసిస్టెంట్ గా చేరి తన రచనతో ఆకట్టుకున్నారు. ఆ తరువాత సోలో రైటర్ గా సాగారు. “భద్ర, ఒక్కడున్నాడు, మున్నా, బృందావనం, సింహా, ఊసరవెల్లి” వంటి చిత్రాలకు రచనలో పాలుపంచుకున్నారు శివ. అదే సమయంలో తన కలను సాకారం చేసుకొనేందుకు మరో వైపు సొంతగా సబ్జెక్ట్స్ రెడీ చేసుకున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆత్మీయులు యు.వి.క్రియేషన్స్ సంస్థను ప్రారంభించి, ప్రభాస్ తో ఓ భారీ చిత్రం నిర్మించాలని తలచారు. అదే సమయంలో కొరటాల శివ తన సబ్జెక్ట్ వినిపించారు. ప్రభాస్ ఇమేజ్ కు ఆ కథ అన్ని విధాలా సరిపోతుందని భావించారు నిర్మాతలు. అలా ‘మిర్చి’తో కొరటాల శివ దర్శకునిగా జనం ముందు నిలిచారు. ‘ఛత్రపతి’ తరువాత ఆ స్థాయి సక్సెస్ మళ్ళీ ప్రభాస్ దరి చేరలేదనుకుంటున్న సమయంలో ‘మిర్చి’ అనూహ్య విజయాన్ని అందించింది.
‘మిర్చి’ ఘనవిజయంతో కొరటాల శివతో కలసి పనిచేసేందుకు టాలీవుడ్ టాప్ స్టార్స్ ఆసక్తి చూపించారు. అలా రెండో సినిమాతోనే మహేశ్ లాంటి టాప్ స్టార్ తో పనిచేసే అవకాశం లభించింది. మహేశ్ తో కొరటాల తెరకెక్కించిన ‘శ్రీమంతుడు’ కూడా ఘనవిజయం సాధించింది. ఆ సినిమా ఘనవిజయం తరువాత మహేశ్, కొరటాలకు ప్రత్యేకంగా ఓ లగ్జరీ కారును బహుమతిగా అందించారు. దీనిని బట్టే కొరటాల స్టామినా ఏంటో టాలీవుడ్ స్టార్స్ కు మరింత బాగా అర్థమయింది. ఆ తరువాత యంగ్ టైగర్ యన్టీఆర్ తో కొరటాల శివ తెరకెక్కించిన ‘జనతా గ్యారేజ్’తోనూ మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు శివ. అలా గ్రాండ్ సక్సెస్ లో హ్యాట్రిక్ చూసిన కొరటాల నాల్గవ చిత్రంగా ‘భరత్ అనే నేను’ చిత్రాన్ని రూపొందించారు. మరోమారు శివతో కలసి మహేశ్ పనిచేసిన ఈ చిత్రం సైతం విజయపథంలోనే పయనించింది.
నాలుగు భారీ విజయాలతో సాగిన కొరటాల శివ, ఐదో చిత్రంతో మెగాస్టార్ చిరంజీవిని ‘ఆచార్య’గా మలిచే అవకాశం సంపాదించారు. ఈ చిత్రంలో చిరంజీవితో పాటు ఆయన తనయుడు రామ్ చరణ్ కలసి నటించినా, బాక్సాఫీస్ ఫలితం నిరాశ కలిగించింది. నాలుగు భారీ విజయాల తరువాత కొరటాల శివకు ‘ఆచార్య’ అసంతృప్తి మిగిల్చింది. జయాపజయాలు ఎవరికైనా తప్పవు. ‘ఆచార్య’ జనాదరణ నోచుకోక పోవడానికి కారణాలేంటో కొరటాల అన్వేషించాలి. వాటిని తరువాతి సినిమాల్లో పునరావృతం కాకుండా చూసుకోవాలి. అప్పుడు మళ్ళీ శివ విజయపథంలో పయనించగలరు. ప్రస్తుతం యన్టీఆర్ హీరోగా కొరటాల శివ ఓ చిత్రం రూపొందించబోతున్నారు. ‘జనతా గ్యారేజ్’లాగా ఈ సినిమాను కూడా సక్సెస్ రూటులో పయనింప చేస్తే కొరటాల శివ మరోమారు తన సత్తా చాటుకున్నట్టవుతుంది.