Kona Venkat on Comrade Kalyan Movie: వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేస్తున్న యంగ్ హీరో శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘కామ్రేడ్ కల్యాణ్’. జానకీరామ్ మారెళ్ల తెరకెక్కించిన ఈ సినిమాలో మహిమా నంబియార్ కథానాయిక. ప్రముఖ రచయిత కోన వెంకట్ సమర్పిస్తున్న ఈ చిత్రంలో రాధికా శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబరు 9న కామ్రేడ్ కల్యాణ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఈరోజు ప్రెస్‌మీట్ నిర్వహించారు. కోన వెంకట్ మాట్లాడుతూ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అందరిలోకెల్లా మీరు చాలా జోష్‌లో కనిపిస్తున్నారు ఈరోజు, ఆదర్శకుటుంబం 47 పోస్ట్ ఫోన్ అవ్వడం వల్ల ఆ కటాక్షం మీకు వస్తుంది అనుకుంటున్నారా? అని కోన వెంకట్‌ను ఓ జర్నలిస్ట్ అడిగారు. అందుకు కోన వెంకట్ తన శైలిలో సమాధానం ఇచ్చారు. ‘నేను అంత శాడిస్ట్‌ని కాదు. నేనొక ఫ్యాక్షనిస్ట్ అవ్వొచ్చు, టూరిస్ట్ అవ్వొచ్చు, కమ్యూనిస్టు కూడా అవ్వొచ్చు కానీ.. శాడిస్ట్‌ని మాత్రం కాదు. జోష్‌లో ఎందుకు ఉన్నానంటే.. నిన్ననే కామ్రేడ్ కల్యాణ్ కాపీ చూశాం. మా భవిష్యత్ తెలిసింది. మీ అందరి మొహాలు కూడా నాకు కనిపించాయి. 3, 3.5 రేటింగ్స్ అలా పైకి వెళ్తున్నాయి. అందుకే నేను చాలా సంతోషంగా ఉన్నా’ అని కోన వెంకట్ సరదాగా చెప్పుకొచ్చారు.

