తెలుగు చిత్రసీమలో ఓ హీరోతో ఓ దర్శకుడు మూడు వరుస విజయాలు చూసి హ్యాట్రిక్
సాధించడం అన్నది కొత్తేమీ కాదు. అయితే ఓ హీరోతో ఓ దర్శకుడు రన్నింగ్ లో కానీ, వసూళ్ళలో కానీ వరుసగా మూడు చిత్రాలతో రికార్డులు సృష్టించడం అన్నది ఆషామాషీ వ్యవహారం కాదు. అలాంటి అరుదైన రికార్డులను నటసింహ నందమూరి బాలకృష్ణతో ఇప్పటి వరకు కోడి రామకృష్ణ, బి.గోపాల్ సాధించారు. వారిద్దరి సరసన ఇప్పుడు బోయపాటి శ్రీను కూడా చేరిపోయారు. ఈ ముగ్గురు దర్శకులు బాలకృష్ణతో సాధించిన ఘనవిజయాలు అలాంటి ఇలాంటివి కావు. ఈ స్థాయిలో ఓ హీరో ముగ్గురు దర్శకులతో హ్యాట్రిక్
సాధించడం అన్నది కూడా అరుదైన అంశమే!
Read Also : ‘అఖండ’ రోరింగ్ హిట్… ఫస్ట్ డే కలెక్షన్స్
బాలకృష్ణ కెరీర్ లోనే తొలి బిగ్ హిట్ గా నిలచిన మంగమ్మగారి మనవడు
వసూళ్ళ వర్షం కురిపించడమే కాదు, రన్నింగ్ లో 565 రోజులు చూసింది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్ .గోపాల్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇదే బ్యానర్ లో బాలకృష్ణకు కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ముద్దుల క్రిష్ణయ్య
(1986) వసూళ్ళ వర్షం కురిపించి, 365 రోజులు ప్రదర్శితమయింది. తరువాత బాలయ్య, కోడి కాంబోలో వచ్చిన మువ్వగోపాలుడు
(1987) చిత్రం కూడా మంచి వసూళ్ళు చూసి, 300 రోజులు ప్రదర్శితమయింది. ఇలా వరుసగా ఓ హీరోతో ఓ దర్శకుడు ఒకే బ్యానర్ లో మూడు త్రిశతదినోత్సవ చిత్రాలు చూడడం అన్నది తెలుగునాట బాలయ్య, కోడి కాంబినేషన్ కే దక్కింది.
బాలకృష్ణతో బి.గోపాల్ తెరకెక్కించిన తొలి చిత్రం లారీ డ్రైవర్
(1990) సూపర్ హిట్ గా నిలవగా, తరువాత 1992లో వారిద్దరి కలయికలో రూపొందిన రౌడీ ఇన్ స్పెక్టర్
పోటీ చిత్రాలకన్నా మిన్నగా వసూళ్ళు చూసి, ఇతరులు తమ సినిమాల కలెక్షన్లను
తిప్పి రాసుకొనే పరిస్థితి ఏర్పరచింది. ఆ తరువాత వీరి కాంబోలో వచ్చిన సమరసింహారెడ్డి
(1999), పోటీ చిత్రాలను చిత్తు చేయడమే కాదు, అంతకు ముందు చిత్రసీమలో నెలకొన్న అనేక రికార్డులను మట్టి కరిపించింది. ఫ్యాక్షనిజాన్ని హీరోయిజంతో ముడివేసి, ఆ తరువాత నుంచీ తెలుగు సినిమా ఇప్పటికీ ఫాలో అయ్యే ఓ కమర్షియల్ ఫార్ములాను టాలీవుడ్ కు అందించిన ట్రెండ్ సెట్టర్ గా ఈ సినిమా నిలచిపోయింది. ఈ చిత్రం తరువాత 2001లో బాలయ్య హీరోగా బి.గోపాల్ తెరకెక్కించిన నరసింహనాయుడు
టాలీవుడ్ లో సంచలన విజయం సాధించడమే కాదు, వంద కేంద్రాలలో శతదినోత్సం జరుపుకున్న తొలి చిత్రంగానూ నిలచింది. అంతేకాదు సమరసింహారెడ్డి, నరసింహనాయుడు
రన్నింగ్ పరంగానూ రికార్డులు నెలకొల్పి, స్వర్ణోత్సవాలు చూశాయి.
Read Also : ఒకనాడు రామారావు… నేడు ‘అఖండ’ : బాలకృష్ణ
బాలకృష్ణతో బోయపాటి తెరకెక్కించిన తొలి చిత్రం సింహా
(2010) చిత్రం 97 కేంద్రాలలో శతదినోత్సవం చూసిన చివరి తెలుగు చిత్రంగా నిలచింది. ఈ సినిమా వసూళ్ల పరంగానూ పలు రికార్డులు బద్దలు చేసింది. 2014లో వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన లెజెండ్
వసూళ్ళ వర్షం కురిపించడమే కాదు, దక్షిణ భారతంలో ఓ చిత్రం నేరుగా 4 ఆటలతో 60 వారాలు ప్రదర్శించిన ఏకైక చిత్రంగా నిలచింది. అంతేకాదు, సౌత్ ఇండియాలో 1005 రోజులు ప్రదర్శితమైన ఏకైక చిత్రంగానూ చరిత్ర సృష్టించింది. ఇన్ని రికార్డులు సాధించిన బాలకృష్ణ, బోయపాటి శ్రీను తాజా చిత్రం అఖండ
సైతం అరుదైన రికార్డులను నెలకొల్పడం విశేషం. తెలుగు సినిమాకు కంచుకోటలాంటి ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలలో అక్కడి ప్రభుత్వం పరిమిత ఆటలు, హెచ్చించని టిక్కెట్ ధరలతో సినిమాలు ప్రదర్శించాలన్న నిబంధన విధించింది. అయినప్పటికీ కొన్ని కేంద్రాలలో ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ను ఆధారం చేసుకొని రూ.500, రూ.400 రేట్లతో టిక్కెట్లు అమ్మారు. ఈ నిబంధన లేక పోయిఉంటే, ఖచ్చితంగా బాహుబలి-2
ను ఈ సినిమా అధిగమించేదని ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. ఏది ఏమైనా ఈ సినిమాతో బాలయ్యకు బోయపాటి హ్యాట్రిక్ అందించారనే వినిపిస్తోంది. దీంతో బాలయ్యకు హ్యాట్రిక్ అందించిన కోడి రామకృష్ణ, బి.గోపాల్ సరసన బోయపాటి కూడా చేరిపోయారని చెప్పవచ్చు.
ఇతర హీరోలకు కూడా ఒకే దర్శకునితో వరుసగా మూడు హిట్స్ కలిగి, హ్యాట్రిక్ చూసిన సందర్భాలు ఉన్నాయి. అయితే వారెవరూ ఈ స్థాయి విజయాలను ముగ్గురు దర్శకులతో వరుసగా చూడక పోవడం గమనార్హం!