యంగ్ హీరో కిరణ్ అబ్బవరంకు తొలి రెండు చిత్రాలు ‘రాజావారు రాణి గారు’, ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’ చక్కని గుర్తింపు నిచ్చాయి. ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’ కమర్షియల్ గానూ చక్కని విజయాన్ని అందుకుంది. కానీ మూడో సినిమా ‘సెబాస్టియన్’ మాత్రం కిరణ్ కు తీవ్ర నిరాశను కలిగించింది. చిత్రం ఏమంటే… ఈ సినిమాల జయాపజయాలతో నిమిత్తం లేకుండానే అతనితో అగ్ర నిర్మాణ సంస్థలు ప్రస్తుతం సినిమాలు నిర్మిస్తున్నాయి. అందులో ఒకటి అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ‘వినరో భాగ్యము విష్ణు కథ’. ఈ మూవీతో మురళీ కిశోర్ అబ్బూరు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రముఖ దర్శకులు ప్రశాంత్ నీల్, కిశోర్ తిరుమల దగ్గర గతంలో మురళీ వర్క్ చేశాడు.
కిరణ్ అబ్బవరం సరసన కశ్మీర పర్దేశీ హీరోయిన్ గా నటిస్తున్న ‘వినరో భాగ్యము విష్ణు కథ’ రెగ్యులర్ షూటింగ్ ను తిరుపతిలో మొదలు పెట్టారు. 35 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్ తో ఎనభై శాతం షూటింగ్ పూర్తి కాబోతోంది. ఇందులో పాటలు, ఫైట్ సీక్వెన్స్ చిత్రీకరణ కూడా జరుగబోతోంది. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ అనే టైటిల్ కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందని, ప్రముఖ సంగీత దర్శకులు చైతన్ భరద్వాజ్ స్వరాలు సమకూర్చుతున్నారని బన్నీ వాసు తెలిపారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ అందిస్తున్న ఈ సినిమాకు విశ్వాస్ సినిమాటోగ్రాఫర్. బాబు సహ నిర్మాత కాగా, సత్య గమిడి, శరత్ చంద్ర నాయుడు ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.