Kiccha Sudeep apologized to the media!
కిచ్చా సుదీప్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘విక్రాంత్ రోణ’ ఈ నెల 28న వివిధ భారతీయ భాషల్లో భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుదీప్ చెన్నయ్, కొచ్చి, హైదరాబాద్ లో కొన్ని ప్రెస్ మీట్స్ లోనూ, ఈవెంట్స్ లోనూ పాల్గొనడానికి ప్లాన్ చేశారు. అయితే సుదీప్ కొద్దిపాటి అనారోగ్యానికి గురి కావడంతో వాటిని చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. దాంతో సుదీప్ మీడియాకు క్షమాపణలు చెప్పారు. ఆరోగ్యం బాగోక ఈవెంట్స్ ను రద్దు చేసుకున్నానని, మీడియా మిత్రులకు కలిగిన అసౌకర్యానికి క్షమించమని కోరారు. ఆరోగ్యం కుదుట పడగానే ఈ ప్రెస్ మీట్స్ ను రీ షెడ్యూల్ చేసుకుని తప్పకుండా ఆ యా రాష్ట్రాలకు వస్తానని మాట ఇచ్చారు. నిజానికి ‘విక్రాంత్ రోణ’ లోని కీలక వ్యక్తులను కొంతకాలంగా అనారోగ్యం పట్టి పీడిస్తోంది. కొద్ది రోజుల క్రితం ఈ మూవీ నిర్మాత మంజునాథ్ గుండెపోటుతో హాస్పిటల్ లో చేరారు. ఆ సమయంలో ఆయన భార్య షాలినీ… మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. విశేషం ఏమంటే… ‘విక్రాంత్ రోణ’ మూవీని రకరకాలుగా ప్రమోట్ చేయడానికి టీమ్ ప్లాన్స్ చేసుకుంది. అందులో భాగంగా మూవీ టైటిల్ లోగోతో టీ షర్ట్స్, జర్కిన్స్, నోట్ బుక్స్, టీ కప్స్, కీ చైన్స్, బ్యాడ్జీలను తయారు చేసి మార్కెట్ చేస్తోంది.
రెండున్నర గంటల నిడివి!
ఇదిలా ఉంటే… ‘విక్రాంత్ రోణ’ సెన్సార్ కార్యక్రమాలు 19వ తేదీన పూర్తయ్యాయి. ఈ మూవీకి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. మూవీ రన్ టైమ్ ను 2.28 నిమిషాలకు లాక్ చేశారు. ఈ యేడాది కన్నడ నుండి వచ్చిన ‘కేజీఎఫ్ -2’ ఘన విజయం సాధించడంతో…. ‘విక్రాంత్ రోణ’పైనా పాజిటివ్ బజ్ ఏర్పడింది. మరి ఈ మూవీ ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.